ఇజ్రాయెల్ ప్రధానిగా పోటీ చేస్తా.. డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2026-05-20 17:28:58  IST  )

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఇజ్రాయెల్ ప్రధానిగా పోటీ చేస్తా.. డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇజ్రాయెల్‌లో తనకు విశేష ప్రజాదరణ ఉందని, భవిష్యత్తులో అక్కడ ప్రధాని పదవికి పోటీ చేసే అవకాశం ఉందంటూ ఆయన చమత్కరించారు. మరోవైపు, ఇజ్రాయెల్‌లో ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

పోటీకి సై అన్న ట్రంప్!

విలేకరులతో ముచ్చటించిన డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ రాజకీయాలపై సరదా వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నాకు 99 శాతం అప్రూవల్ రేటింగ్ (మద్దతు) ఉంది. నా పదవీ కాలం ముగిశాక, బహుశా నేను అక్కడ ప్రధాని పదవికి పోటీ చేయవచ్చేమో!’ అని ఆయన నవ్వుతూ అన్నారు. అలాగే ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును చాలా మంచి వ్యక్తిగా ఆయన అభివర్ణించారు.

నెతన్యాహుకు ముందస్తు ఎన్నికల ముప్పు

ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన తరుణంలోనే, ఇజ్రాయెల్ రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం నెలకొన్నదని అంతర్జాతీయ మీడియా స్పష్టం చేస్తోంది. గత 17 ఏళ్లలో ఎక్కువ భాగం అధికారంలో ఉన్న నెతన్యాహుకు ఇప్పుడు సొంత కూటమి నుంచే సెగ తగులుతోంది. సైనిక నియామక మినహాయింపుల విషయంలో నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక మిత్రపక్షమైన ‘అల్ట్రా-ఆర్థోడాక్స్’ మతపరమైన పార్టీలు మద్దతు ఉపసంహరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్) రద్దుకు ఉద్దేశించిన ప్రాథమిక బిల్లు ఇప్పటికే ఆమోదం పొందింది. అక్టోబర్ 7, 2023 నాటి హమాస్ దాడుల తర్వాత భద్రతా వైఫల్యాలపై నెతన్యాహు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు తాజా రాజకీయ పరిణామాలు ఆయనకు అతిపెద్ద ముప్పుగా మారాయి. ఈ బిల్లుకు పూర్తి ఆమోదం లభిస్తే, ఈ ఏడాది చివర్లో (బహుశా సెప్టెంబర్‌లో) ఇజ్రాయెల్‌లో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

పుతిన్ - జిన్‌పింగ్ భేటీపై ట్రంప్ స్పందన

ఇదే సమావేశంలో, చైనా పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భేటీపై కూడా ట్రంప్ స్పందించారు. ఆ ఇద్దరు నేతలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ గుర్తుచేశారు. ఈ పర్యటన గురించి తనకు ముందుగానే సమాచారం ఉందని, ఇది ఒక సానుకూల పరిణామమని ఆయన అన్నారు. వారి స్వాగత కార్యక్రమాన్ని తాను చూశానని చెబుతూ.. ‘మేము వారిని మించిపోయాము (we topped them)’ అని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.

Next Story