- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ లో ముసలం
కర్ణాటకలోని కాగవాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభించడంలో జరుగుతున్న ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో:కర్ణాటకలోని కాగవాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభించడంలో జరుగుతున్న ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఇలా కొనసాగితే రాజీనామా చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బెలగావి జిల్లాలోని ఐనాపూర్‌లో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రెండు సంవత్సరాల క్రితం రూ. 25 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ ఆమోదించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క పని ఆర్డర్ కూడా ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిధుల్లో రూ. 12 కోట్లు రోడ్ల అభివృద్ధికి, రూ. 13 కోట్లు 72 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి మంజూరయ్యాయని తెలిపారు. ‘మేము ప్రతిపాదనలు సమర్పించాం. అయినప్పటికీ ఒక్క పని ఆర్డర్ కూడా మంజూరు కాలేదు. రెండు సంవత్సరాలపాటు ప్రారంభానికి ఆలస్యమా’ అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర పరిపాలన విఫలమైందని తాను రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
అవినీతి, ఆరోపణలపై కాంగ్రెస్ సీరియస్
ఎమ్మెల్యే రాజు కాగే, ప్రస్తుతం ఉత్తర పశ్చిమ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NWKRTC) ఛైర్మన్‌గా ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ చేసిన ఆరోపణలకు పూర్తి మద్దతుగా తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల లీకైన ఓ ఆడియోలో బీఆర్ పాటిల్, హౌసింగ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ వ్యక్తిగత సహాయకుడు సర్ఫరాజ్ ఖాన్‌తో మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇళ్ల కేటాయింపులు లంచాలు ఇచ్చిన వారికి మాత్రమే జరిగాయని ప్రజాప్రతినిధుల లేఖలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ ఆరోపణల గురించి నాకు పూర్తిగా సమాచారం లేదు. త్వరలో విచారించి స్పందిస్తాను అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ నాగరాజ్ యాదవ్ మాత్రం బీఆర్ పాటిల్, రాజు కాగే వ్యాఖ్యలను బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. పాటిల్ వంటి సీనియర్ నేతకు వ్యవస్థ ఎలా పని చేస్తుందో తెలియాలి. ఎవరైనా అక్రమాలు చేస్తే సంబంధిత మంత్రిని లేదా లోకాయుక్తను ఆశ్రయించాలి. పార్టీ ఈ ప్రవర్తనకు మద్దతివ్వదు. అధిష్టానం ఈ వ్యవహారాన్ని గమనిస్తోంది అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చలవాడి నారాయణస్వామి మాట్లాడుతూ.. కర్ణాటకలో పరిపాలన పూర్తిగా ఫెయిలైంది. న్యాయ అభివృద్ధి వ్యవస్థలు స్తంభించాయన్నారు. ఇప్పుడు ఏ పని చేయించాలన్నా డబ్బు ఇవ్వాల్సిందే. లేకపోతే ఏదీ జరగదని వ్యాఖ్యానించారు.






