దలైలామా వారసత్వం ఎంపికపై నిర్ణయం.. చైనాకు షాక్ ఇచ్చిన బౌద్ధమత గురువు

by Shamantha N |

15వ దలైలామా ఎంపిక అధికారం గాడెన్‌ ఫోడ్రోంగ్‌ ట్రస్ట్‌కు ఉందని చెప్పి టిబెట్‌ బౌద్ధమత గురువు దలైలామా (Dalai Lama) చైనా కు గట్టి కౌంటర్ ఇచ్చారు.

దలైలామా వారసత్వం ఎంపికపై నిర్ణయం.. చైనాకు షాక్ ఇచ్చిన బౌద్ధమత గురువు
X

దిశ, నేషనల్ బ్యూరో: 15వ దలైలామా ఎంపిక అధికారం గాడెన్‌ ఫోడ్రోంగ్‌ ట్రస్ట్‌కు ఉందని చెప్పి టిబెట్‌ బౌద్ధమత గురువు దలైలామా (Dalai Lama) చైనా కు గట్టి కౌంటర్ ఇచ్చారు. గాడెన్‌ ఫోడ్రోంగ్‌ ట్రస్ట్‌ మాత్రమే దలైలామాకు పునర్జన్మను నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు. చాలా ఏళ్ల క్రితం దలైలామా ఒక దశలో తనతోనే ఈ సంప్రదాయం ముగిసిపోతుందని ఆందోళన చెందారు. ఆ తర్వాత తన పునర్జన్మ టిబెట్‌ బయట జరగొచ్చని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దలైలామా వారసత్వం భవిష్యత్తులో కొనసాగించాలని 2011 సెప్టెంబర్ 24న నిర్వహించిన సమావేశంలోనే టిబెట్ మత పెద్దలు, చైనాలోని వారు కూడా అంగీకారం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. దీనికనుగుణంగానే వారసత్వ ప్రకటన చేశారు. అయితే తన వారసత్వం కొనసాగడమా లేక అంతం అయిపోతుందా అనేది ప్రజలే నిర్ణయిస్తారని తాను 1969లోనే తెలిపానని దలైలామా గుర్తు చేశారు.

టిబెట్ కోసం చైనా ఆరాటం

చైనా టిబెట్ ను తమ ఆధీనంలో ఉంచుకోవడానికి దలైలామా వారసుడిని ఎంపిక చేయాలని ఎప్పటి నుంచో ఆరాటపడుతుంది. దలైలామా ప్రకటనతో ఆ దేశానికి పెద్ద షాక్ ఇచ్చినట్లు అయింది. 1950 లో చైనా టిబెట్ ను ఆక్రమించింది. చైనా మూలాలున్న హన్ జాతి ప్రజల్ని టిబెట్ లోకి పంపించారు. టిబెట్ లోని చిన్నారులను చైనా పంపించి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు అన్నింటినీ నేర్పించారు. టిబెట్ పీఠభూమిలో వివిధ రకాల ప్రకృతి సంపద కొల్లగొట్టేందుకే ఇలా చైనా చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. టిబెట్ లో బొగ్గు, జింక్, సీసం, రాగి, క్రోమియం లాంటి నిక్షేపాలు ఉన్నాయి. చైనా దలైలామా వారసుడిని టిబెట్ లో ఎంపిక చేసేందుకు ప్లాన్ వేసింది. చైనా వేసిన ఎత్తుగడను దాటేందుకు దలైలామా టిబెట్ వెలుపల కూడా దలైలామా వారసత్వ ఎంపిక కొనసాగుతుందని చెప్పి షాక్ ఇచ్చారు.

Next Story