అమెరికాలో మళ్లీ కరోనా కలకలం

by Yella Dhawani Reddy |

అమెరికాలో మళ్లీ కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది.

అమెరికాలో మళ్లీ కరోనా  కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో మళ్లీ కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ కరోనా వైరస్ బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికితోడు ప్రస్తుతం అమెరికాలో సమ్మర్ సీజన్ ఉండటంతో సెలవుల కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తుండటం, తీర ప్రాంతాలకు, పర్యాటక ప్రాంతాలకు తరలిపోవడం వైరస్ వేగంగా వ్యాపిస్తోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియా, ఒహియో వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

ప్రస్తుతం NB.1.8.1, XFG అనే కొత్త వేరియంట్లు అమెరికాలో వ్యాపిస్తున్నాయని CDC పేర్కొంది. ఈ వేరియంట్ల ప్రభావం వల్ల గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె బరువుగా ఉండటం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. మురుగునీటిలో ఈ వైరస్ అధికంగా ఉంటుందని ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఫంక్షన్లు, రవాణా ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించాలని హెచ్చరిస్తున్నారు.

ఈ వేరియంట్లు ప్రాణాంతకం కాకపోయినా, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు, వృద్ధులు, చిన్న పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, ఆరోగ్య నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. సమ్మర్ సీజన్‌లో కరోనా వ్యాప్తి ప్రజల్లో మరోసారి భయం, ఆందోళన కలిగిస్తోంది. విస్తరిస్తున్న కేసుల నేపథ్యంలో ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమని అధికారుల హెచ్చరిస్తున్నారు.

Next Story