పూరీ రథయాత్రలో విషాదం.. కలెక్టర్, ఎస్పీపై బదిలీ వేటు

by Shamantha N |

ఒడిశా రాష్ట్రం పూరీలో ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మరణించడం పట్ల ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

పూరీ రథయాత్రలో విషాదం.. కలెక్టర్, ఎస్పీపై బదిలీ వేటు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా రాష్ట్రం పూరీలో ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మరణించడం పట్ల ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మాఝి బాధిత కుటుంబాలను క్షమాపణ కోరారు. ఎక్స్ లో ఒక పోస్ట్‌లో భగవంతుని దివ్య దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు రావడంతో అధిక రద్దీ వల్ల ఈ ఘోర విషాదం జరిగింది అని పేర్కొంటూ సంఘటనకు కారణాన్ని ఆయన వివరించారు. కాగా మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా పరిహారాన్ని ఆయన ప్రకటించారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కమిషనర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి పరిపాలనా విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది.

కలెక్టర్, ఎస్పీలపై వేటు

ఈ విషాదానికి ప్రతిస్పందనగా ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ట్రాన్స్ ఫర్ చేశారు. పూరీ జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ (SP) ను బదిలీ చేశారు. చంచల్ రాణాను కొత్త కలెక్టర్ గా, పినాక్ మిశ్రా కొత్త ఎస్పీగా నియమించారు. వీరితో పాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో డీసీపీ విష్ణు, కమాండెంట్ అజయ్ పాహిలను కూడా సస్పెండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ అధికారి అరవింద్ అగర్వాల్‌ను రథయాత్ర మొత్తం పర్యవేక్షణకు ఇన్‌చార్జ్‌గా నియమించారు. పూరీలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు చనిపోగా.. కొంతమంది గాయపడ్డారు. శారదబలి వద్ద శనివారం తెల్లవారుజామున 4. 00 గంటల నుంచి 5:00 గంటల మధ్య యాత్రికులు రథాలపై ఉన్న దేవతలను చూడటానికి భారీగా గుమిగుడిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతులను ప్రేమకాంత మొహంతి (80), బసంతి సాహూ (36), ప్రభాతి దాస్ (42) గా గుర్తించినట్లు పూరీ జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రి అధికారులు తెలిపారు. ప్రస్తుతం పూరీలో పరిస్థితి అదుపులోనే ఉందని పర్యవేక్షణ ఇన్ చార్జి అరవింద్ అగర్వాల్ తెలిపారు.

Next Story