- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తైవాన్ జోలికొస్తే యుద్ధమే..ట్రంప్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు నిన్న సమావేశమయ్యారు. సుమారు రెండుగంటలపాటు జరిగిన ఈ భేటీలో వాణిజ్య, తైవాన్, ఇరాన్ యుద్ధం, క్రిటికల్ మినరల్స్, ఏఐ పోటీ వంటి అంశాలపై చర్చించినట్టు తెలిసింది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు నిన్న సమావేశమయ్యారు. సుమారు రెండుగంటలపాటు జరిగిన ఈ భేటీలో వాణిజ్య, తైవాన్, ఇరాన్ యుద్ధం, క్రిటికల్ మినరల్స్, ఏఐ పోటీ వంటి అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ఆ తర్వాత ట్రంప్, ఆయన కేబినెట్ మంత్రులు మార్కో రూబియో, స్కాట్ బీసెంట్ సహా వ్యాపార దిగ్గజాలు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్, ఎన్‌వీడియా చీఫ్ జెన్‌సెన్ హువాంగ్ సహా పలువురు ప్రముఖులకు జిన్‌పింగ్ విందునిచ్చారు. అనంతరం, ట్రంప్, జిన్‌పింగ్ ఇరువురూ మాట్లాడారు. సుమారు దశాబ్ద కాలం తర్వాత.. అదీ ఒకవైపు ఇరాన్ యుద్ధం.. మరోవైపు తైవాన్‌కు అమెరికా ఆయుధాలు సరఫరా చేస్తున్న సందర్భంలో ట్రంప్ చైనా పర్యటించారు. ఆయన సుంకాలపై దేశీయంగా ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో వాణిజ్య యుద్ధంలో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న చైనాకు వెళ్లి ఆ దేశాధ్యక్షుడితో సమావేశమయ్యారు.
జిన్‌పింగ్ నాకు ఆప్తమిత్రుడు
ట్రంప్‌కు చైనాలో ఘనస్వాగతం లభించింది. నిన్న అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా ట్రంప్‌ను గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. అనంతరం, క్లోజ్డ్ డోర్ మీటింగ్ జరిగింది. తర్వాత విందునిచ్చారు. ఈ సందర్బంగా ట్రంప్.. జిన్‌పింగ్‌పై ప్రశంసలు కురిపించారు. ‘జిన్‌పింగ్ నాకు అత్యంత ఆప్తమిత్రుడు. అమెరికా, చైనాలు శత్రువులుగా కాదు.. మిత్రులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’ అని ట్రంప్ పిలుపునిచ్చారు. అంతేకాకుండా చైనాతో వాణిజ్యాన్ని సమతుల్యం చేసుకోవాలని, అమెరికా మార్కెట్లలో చైనా వాణిజ్యానికి మరిన్ని అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సదస్సు చరిత్రలోనే అతిపెద్దదిగా నిలిచిపోతుందంటూ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, అమెరికాతో వాణిజ్యానికి తాము ప్రాధాన్యతనిస్తామని జిన్‌పింగ్ వివరించారు. మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ అనే నినాదంతో తమలో పోటీకి ఉపకరిస్తుందని తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మొత్తం ప్రపంచానికే ప్రయోజనాలు సమకూర్చుతాయని వివరించారు.
తైవాన్ విషయంలో తగ్గేదే లే
వాణిజ్యపరంగా స్నేహ హస్తం అందించినప్పటికీ తైవాన్ అంశం దగ్గరకు వచ్చేసరికి జిన్‌పింగ్ గట్టిగానే స్పందించారు. తైవాన్ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా సంబంధాలు ప్రమాదకరంగా మారుతాయని, అది నేరుగా యుద్ధానికి దారితీస్తుందని జిన్‌పింగ్ హెచ్చరించారు. ‘తైవాన్ మా అంతర్గత విషయం.. అక్కడ పరిస్థితి హద్దు దాటితే అమెరికా, చైనాల మధ్య ఘర్షణలు తప్పవు’ అని ముఖం మీదే చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘అమెరికా, చైనాల మధ్య తైవాన్ అంశం ప్రాధాన్యతగా ఉన్నది. ఈ అంశాన్ని ఉభయ దేశాలు సరిగ్గా హ్యాండిల్ చేయాలి. అలా చేస్తే ఇరుదేశాల మధ్య సత్సంబంధాలుంటాయి. మరింత బలపడుతాయి. లేదంటే ఇరుదేశాల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. అవి ఘర్షణల వరకూ వెళ్లొచ్చు’ అని ట్రంప్‌కు జిన్‌పింగ్ స్పష్టంగా తెలియజేసినట్టు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
జిన్‌పింగ్‌కు ట్రంప్ ఆహ్వానం
మరోవైపు ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికాలో ట్రంప్ రేటింగ్స్ తగ్గుతున్న తరుణంలో ఈ పర్యటన ద్వారా ఆర్థిక విజయాలు సాధించాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఎలాన్ మస్క్ వంటి దిగ్గజ సీఈఓలను కూడా వెంటబెట్టుకొచ్చారు. బోయింగ్ విమానాల కొనుగోలు, చమురు ఎగుమతులపై కీలక ఒప్పందాలు చేసుకున్నారు. సెప్టెంబర్ 24న వైట్ హౌస్‌ను సందర్శించాల్సిందిగా జిన్‌పింగ్ దంపతులను ట్రంప్ అధికారికంగా ఆహ్వానించారు. చైనా ప్రజలు, అమెరికా ప్రజల మధ్య ఉన్న పటిష్టమైన బంధం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అంతేకాకుండా చమురు సరఫరాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిని స్వేచ్ఛగా తెరిచి ఉండాలని అమెరికా- చైనా అంగీకరించాయి.






