బుర్జ్ ఖలీఫాను ఢీకొట్టిన భారీ పిడుగు! చెక్కుచెదరని ప్రపంచంలోనే ఎత్తైన భవనం.. ఎందుకంటే?

by Ramesh Naini |

యూఏఈ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుఫాను కారణంగా దుబాయ్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన భవనం ‘బుర్జ్ ఖలీఫా’పై గురువారం రాత్రి భారీ పిడుగు పడింది.

బుర్జ్ ఖలీఫాను ఢీకొట్టిన భారీ పిడుగు! చెక్కుచెదరని ప్రపంచంలోనే ఎత్తైన భవనం.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూఏఈ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుఫాను కారణంగా దుబాయ్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన భవనం ‘బుర్జ్ ఖలీఫా’పై గురువారం రాత్రి భారీ పిడుగు పడింది. 2,272 అడుగుల ఎత్తైన ఈ భవనంపై పిడుగు పడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భవనంపై చివరి భాగంలో పిడుగు ఢీ కొట్టే సమయంలో భారీ మెరుపు దృశ్యాలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ వీడియోలు నెటిజన్‌లను ఆశ్చర్యపరిచింది. ఆ విజువల్స్ చూడటానికి ఎంతో ఆకర్షనీయంగా ఉందని నెటిజన్‌లు కామెంట్స్ చేశారు.

ఒక రక్షణ కవచంలా..

కాగా, ఇటీవల ఉద్రిక్త పరిస్థితుల (క్షిపణి దాడుల భయం) నడుమ కూడా నిలబడిన ఈ అద్భుత కట్టడం.. ప్రకృతి కోపాన్ని సైతం అంతే ధీటుగా ఎదుర్కొని సురక్షితంగా నిలిచింది. ఆకాశం నుంచి పడే భయంకరమైన పిడుగుల నుంచి ఈ భవనం తనను తాను ఎలా రక్షించుకుంటుందో తెలుసుకుందాం.. భవన నిర్మాణంలో ఉపయోగించిన బలమైన ఉక్కు చట్రం (Steel frame) ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. భవనం పైభాగంలో ప్రత్యేకమైన పిడుగుల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తుఫాను సమయంలో ఈ ‘లైట్నింగ్ రాడ్’ (Lightning Rod) పిడుగులను తన వైపు ఆకర్షించి, భవనంపై మరెక్కడా పడకుండా చేస్తుంది. పైభాగంలో ఆకర్షించిన పిడుగు విద్యుత్‌ను భవనం లోపలికి వెళ్లనివ్వకుండా, కింది భాగంలో ఉన్న గ్రౌండింగ్ సిస్టమ్ (Grounding System) ద్వారా సురక్షితంగా భూమిలోకి పంపుతారు. ఒకేసారి ఎన్ని పిడుగులు పడినా తట్టుకునేలా రూపొందించారు. ఈ అత్యాధునిక సాంకేతికత వల్లే భవనంలోని ప్రజలకు, లిఫ్టులకు, ఇతర విద్యుత్ పరికరాలకు ఎలాంటి ప్రమాదం జరగదని నిపుణులు చెబుతున్నారు.

Next Story