అనాథగా పుట్టి.. గ్లోబల్ స్టార్‌గా ఎదిగి.. జపాన్ టూరిజానికి కొత్త ఊపిరిలూదిన కోతిపిల్ల ‘పంచ్’

by Ramesh Naini |   (  Updated:2026-05-17 16:35:28  IST  )

జపాన్ పర్యాటక రంగానికి సరికొత్త ఉత్తేజాన్నిస్తూ, ఏకంగా లక్షలాది మంది టూరిస్టులను ఆకర్షిస్తున్న ఆ బుల్లి సెలబ్రిటీ పేరు ‘పంచ్ కున్’ (Punch Kun). అనాథగా మారి, తోటి కోతుల చేతిలో దెబ్బలు తిన్న ఒక చిన్నారి కోతి.. నేడు జపాన్ లోనే అతిపెద్ద స్టార్‌గా ఎలా ఎదిగిందో తెలిపే ఈ కథ అందరి హృదయాలను హత్తుకుంటోంది.

అనాథగా పుట్టి.. గ్లోబల్ స్టార్‌గా ఎదిగి.. జపాన్ టూరిజానికి కొత్త ఊపిరిలూదిన కోతిపిల్ల ‘పంచ్’
X

దిశ, డైనమిక్ బ్యూరో: యుద్ధాలు, సంక్షోభాలతో సతమతమవుతున్న నేటి ప్రపంచానికి ఓ తొమ్మిది నెలల మంచు కోతి పిల్ల ముద్దుచేష్టలు కొత్త ఉత్సాహాన్ని పంచుతున్నాయి. జపాన్ పర్యాటక రంగానికి సరికొత్త ఉత్తేజాన్నిస్తూ, ఏకంగా లక్షలాది మంది టూరిస్టులను ఆకర్షిస్తున్న ఆ బుల్లి సెలబ్రిటీ పేరు ‘పంచ్ కున్’ (Punch Kun). అనాథగా మారి, తోటి కోతుల చేతిలో దెబ్బలు తిన్న ఒక చిన్నారి కోతి.. నేడు జపాన్ లోనే అతిపెద్ద స్టార్‌గా ఎలా ఎదిగిందో తెలిపే ఈ కథ అందరి హృదయాలను హత్తుకుంటోంది.

కంటతడి పెట్టిస్తున్న గతం..

మకాక్ (Macaque) జాతికి చెందిన ఈ మంచు కోతి కథ ఒక విషాదంతో మొదలైంది. జపాన్ ప్రభుత్వం ఇచికావా సిటీ జూ (Ichikawa City Zoo) లో ఈ జాతి కోతులను సంరక్షిస్తోంది. అయితే, తొలి కాన్పులో పుట్టిన ఈ మగబిడ్డను తల్లి పక్కకు విసిరికొట్టింది. కనీసం పట్టించుకోకపోగా, దగ్గరకు వెళ్లినా ఆ బిడ్డ ఎవరో తెలియనట్టుగానే వ్యవహరించింది. దీనికి తోడు తోటి పెద్ద కోతులు సైతం ఈ చిన్నారిని నేలకేసి కొట్టడం, ఈడ్చుకుంటూ వెళ్లడం వంటి వేధింపులకు గురిచేశాయి. ఈ హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచం దృష్టి ఈ అనాథ కోతిపిల్లపై పడింది.

జూ సిబ్బంది ఆదరణ.. గ్లోబల్ సెలబ్రిటీగా ప్రయాణం

అనాథగా మారిన ఆ మగబిడ్డకు జూ సంరక్షకులు ‘పంచ్ కున్’ అని నామకరణం చేసి ప్రత్యేక శ్రద్ధతో పెంచడం ప్రారంభించారు (జపాన్‌లో మగపిల్లలను ముద్దుగా ‘కున్’ అని పిలుస్తారు). జపాన్ లోని ‘యోమియురి షింబున్’ (Yomiuri Shimbun) లాంటి ప్రధాన పత్రికలతో పాటు పశ్చిమ దేశాల మీడియా కూడా పంచ్ కున్ వెతలను ప్రముఖంగా ప్రచురించడంతో ఈ కోతిపిల్ల రాత్రికి రాత్రే గ్లోబల్ సెలబ్రిటీగా మారిపోయింది.

రూ. 20 కోట్ల విరాళాలు.. 5 లక్షల మంది పర్యాటకులు

పంచ్ కున్ కథ తెలుసుకున్న దయా హృదయం ఉన్నవారు ఈ కోతిపిల్ల సంరక్షణ కోసం ఏకంగా రూ. 20 కోట్ల భారీ విరాళాలను ఇచికావా జూకి పంపించారు. కేవలం ఈ బుడతడిని స్వయంగా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది టూరిస్టులు జపాన్‌కు తరలివచ్చారు. పంచ్ కున్ ముద్దు చేష్టలకు సంబంధించిన వందలాది వీడియోలు ప్రతిరోజూ వివిధ భాషల్లో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికీ రోజుకు వేలాది మంది ఈ చిన్నారిని చూసేందుకు జూకి క్యూ కడుతున్నారు.

మార్కెట్లో ‘పంచ్’ క్రేజ్..

ప్రస్తుతం ఆరు పౌండ్ల బరువున్న పంచ్ కున్ పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగైంది. ఇప్పుడు తను మెల్లగా తన కోతుల గుంపుతో కలుస్తున్నాడు. తోటి కోతులతో పాటు మనుషులతోనూ స్నేహం చేస్తున్నాడు. పంచ్ కున్ క్రేజ్ ఏ స్థాయికి చేరిందంటే.. పంచ్ పేరు మీద టీ-షర్టులు, యాక్షన్ ఫిగర్లు, సోషల్ మీడియా స్టిక్కర్లు మార్కెట్లోకి వచ్చేశాయి. పంచ్ కున్ ఆడుకునే ఒక ఐకియా (IKEA) ఒరంగుటాన్ బొమ్మకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగి, స్టాక్ మొత్తం అమ్ముడుపోయింది. ప్రపంచం నలుమూలల నుంచి వందలాది మంది అభిమానులు ప్రతిరోజూ లేఖలు, బొమ్మలు గీసి జూకి పంపుతున్నారు. సాధారణంగా 22 ఏళ్ల జీవితకాలం ఉండే మకాక్ కోతుల జాతిలో పుట్టిన పంచ్ కున్.. తన ఆకట్టుకునే రూపంతో, హృదయాన్ని ద్రవింపజేసే గతాన్ని దాటుకుని, నేడు ఇచికావా జూ రూపురేఖలనే మార్చేసి జపాన్ పర్యాటక రంగానికి సరికొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచాడు.

Next Story