నిక్కీ హేలీకి భారీ షాక్: సౌత్ కరోలినాలోనూ ట్రంప్ విజయం

by Dishanational2 |
నిక్కీ హేలీకి భారీ షాక్: సౌత్ కరోలినాలోనూ ట్రంప్ విజయం
X

దిశ, నేషనల్ బ్యూరో: రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరింత ముందుకెళ్లాడు. తాజాగా జరిగిన సౌత్ కరోలినా ఎన్నికల్లో ప్రత్యర్థి నిక్కీ హేలీపై విజయం సాధించాడు. ట్రంప్‌కు 63శాతం ఓట్లు రాగా, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీకి 36.8శాతం ఓట్లు వచ్చాయి. ఇది డొనాల్డ్‌కు వరుసగా ఐదో విజయం. గతంలో అయోవా, న్యూ హాంప్‌షైర్, నెవాడా, యూఎస్ వర్జిన్ ఐలాండ్స్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ ట్రంప్ గెలుపొందారు. అయితే తన సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీ ఓటమి పాలవడంతో ఆమెకు భారీ షాక్ తగిలినట్టు అయింది. తదుపరి ఎన్నికలు మార్చి 5న మిచిగావ్ రాష్ట్రంలో జరగనున్నాయి. మరోవైపు, డెమోక్రటిక్ పార్టీకి ప్రాథమిక ఎన్నికలు ఈ నెల 4న జరగగా..అధ్యక్షుడు జో బైడెన్ గెలిచారు. కాగా, ఈ ఏడాది నవంబర్‌లో యూఎస్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందు రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల అభ్యర్థిత్వానికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

అధ్యక్ష రేసు నుంచి వెనక్కి తగ్గను: నిక్కీ హేలీ

ఫలితాల అనంతరం నిక్కీ హేలీ మాట్లాడుతూ..ఓటమిని అంగీకరించబోనని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైతే, బైడెన్ మరోసారి ఎన్నికల్లో గెలుస్తారని ఇటీవల చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక రిపబ్లికన్ల తరఫున అభ్యర్థిత్వాన్ని ఆశించిన వివేక్ రామస్వామి, రాన్ డీ శాంటీస్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్, హేలీ మాత్రమే పోటీ పడుతున్నారు. రేసు నుంచి తప్పుకోవాలని పలువురు హేలీకి సూచించినా ఆమె వాటిని తిరస్కరించారు. అయితే 77 ఏళ్ల ట్రంప్ నాలుగు క్రిమినల్ కోర్టు కేసులు మరియు 91 నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. అంతేగాక ఆరోగ్య సమస్యలు సైతం ఆయనను వెంటాడుతున్నాయి. దీంతో ఒకవేళ ఈ కారణాల వల్ల ట్రంప్ తప్పుకోవాల్సి వస్తే ప్రత్యామ్నాయంగా నిక్కీ మారుతుందని, అందుకే రేసులో ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు.



Next Story

Most Viewed