బంగ్లాకు పాక్ యుద్ధ విమానాలు..దళాధిపతుల కీలక భేటీ!

by B.Srinivas |

పాకిస్థాన్‌-బంగ్లాదేశ్ మధ్య కీలక ఒప్పందాలు జరుగుతున్నాయి. పాక్ నుంచి యుద్ధ విమానాల కొనుగోలుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది.

బంగ్లాకు పాక్ యుద్ధ విమానాలు..దళాధిపతుల కీలక భేటీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌-బంగ్లాదేశ్ మధ్య కీలక ఒప్పందాలు జరుగుతున్నాయి. పాక్ నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఇరు దేశాల దళాధిపతులు సమావేశమగా.. చైనా, పాక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన జేఎఫ్‌-17 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్‌ ఆసక్తి చూపుతున్నట్లు పాక్‌ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది.

విమానాలతోపాటు సైనిక శిక్షణ..
ఈ మేరకు ఇస్లామాబాద్‌ వేదికగా పాకిస్తాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ, బంగ్లాదేశ్ కౌంటర్ హసన్ మహమూద్ ఖాన్ యుద్ధ విమానాల కోనుగోలుపై చర్చలు జరిపారని పాక్ మిలిటరీ ప్రెస్ వింగ్ తెలిపింది. ఈ సందర్భంగా జేఎఫ్‌-17 యుద్ధ విమానాల సేకరణపై విస్తృత స్థాయి చర్చలు జరిగినట్లు చెప్పింది. మొహ్మద్‌ ఖాన్‌ నేతృత్వంలోని బంగ్లా బృందం ఆయా కేంద్రాల్లోనూ పర్యటించి పరిశీలించినట్లు స్పష్టం చేసింది. అంతేకాదు సూపర్‌ ముష్షాక్‌ శిక్షణా విమానంతోపాటు సైనిక కేంద్రాల్లో సమగ్ర శిక్షణ అందిస్తామని, ఇందుకు కావాల్సిన మొత్తం వ్యవస్థను వేగంగా డెలివరీ చేస్తామని బంగ్లాకు పాక్‌ సైన్యం హామీ ఇచ్చినట్లు సమాచారం.

4 బిలియన్ల ఒప్పందం..
ఈ పర్యటన పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య బలమైన చారిత్రక సంబంధాలను ప్రతిబింబిస్తుందని, రక్షణ సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి, దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించడానికి దోహదం చేస్తుందని పాక్ సైన్యం తెలిపింది. జేఎఫ్‌-17 యుద్ధ విమానాల తయారీ పాకిస్తాన్ సైన్యం అభివృద్ధికి కీలకంగా మారాయని పేర్కొంది. అజర్‌బైజాన్‌తో పాటు లిబియా సైన్యంతో పాక్ $4 బిలియన్ల ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ‘మా విమానాలను పలుదేశాల సైన్యాలు పరీక్షించాయి. మాకు చాలా ఆర్డర్లు వస్తున్నాయి. ఆరు నెలల్లో పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి అవసరం ఉండకపోవచ్చు’ అని పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ జియో న్యూస్‌తో అన్నారు.

Next Story