కెనడాలో దారుణం.. భారత యువతిని గొంతు నులిమి చంపిన ప్రియుడు

by Ramesh Naini |

కెనడాలో మరో భారతీయ యువతి దారుణ హత్యకు గురైంది. పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల దమన్‌ప్రీత్ కౌర్‌ను ఆమె సహజీవన భాగస్వామే గొంతు నులిమి చంపినట్లు కెనడా పోలీసులు వెల్లడించారు.

కెనడాలో దారుణం.. భారత యువతిని గొంతు నులిమి చంపిన ప్రియుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కెనడాలో మరో భారతీయ యువతి దారుణ హత్యకు గురైంది. పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల దమన్‌ప్రీత్ కౌర్‌ను ఆమె సహజీవన భాగస్వామే (లివ్-ఇన్ పార్టనర్) గొంతు నులిమి చంపినట్లు కెనడా పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కెనడాలోని ఎడ్మాంటన్ నగర పరిధిలోని సిల్వర్‌బెర్రీ ప్రాంతంలో జూలై 9న దమన్‌ప్రీత్ కౌర్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, విషమ పరిస్థితిలో చికిత్స పొందుతూ జూలై 12న మృతి చెందింది. పోస్టుమార్టం నివేదికలో ఆమెను గొంతు నులిమి చంపినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఢిల్లీకి చెందిన ఆమె ప్రియుడు రితిష్ కుమార్ (22)ను జూలై 22న అరెస్టు చేసి, అతనిపై ‘సెకండ్-డిగ్రీ మర్డర్’ కింద అభియోగాలు నమోదు చేశారు. ఈ హత్య వెనుక మరెవరి ప్రమేయం లేదని, ఇదొక ‘ఇంటిమేట్ పార్టనర్ హోమిసైడ్’ (సహజీవన భాగస్వామి చేసిన హత్య) అని పోలీసులు స్పష్టం చేశారు.

విషాదంలో కుటుంబ సభ్యులు

దమన్‌ప్రీత్ స్వస్థలం పంజాబ్‌లోని లూధియానా జిల్లా సమ్రాల. ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తు కోసం ఐదేళ్ల క్రితం తల్లిదండ్రులు అప్పు చేసి మరీ ఆమెను కెనడా పంపించారు. ఈ చేదు వార్తతో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దమన్‌ప్రీత్ భౌతిక కాయాన్ని అంత్యక్రియల నిమిత్తం భారత్‌కు తీసుకురావడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు ‘గో ఫండ్ మీ’ (GoFundMe) క్యాంపెయిన్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు.

Next Story