నింగిలోంచి నెలవంకలా భూమి.. జాబిల్లి చెంతకు దూసుకెళ్తున్న ఆర్టెమిస్ 2

by Ramesh Naini |

చంద్రుడిని చుట్టొచ్చేందుకు నలుగురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లిన నాసా ప్రతిష్టాత్మక ‘ఆర్టెమిస్‌ 2’ మిషన్ విజయవంతంగా ముందుకు సాగుతోంది.

నింగిలోంచి నెలవంకలా భూమి.. జాబిల్లి చెంతకు దూసుకెళ్తున్న ఆర్టెమిస్ 2
X

దిశ, డైనమిక్ బ్యూరో: చంద్రుడిని చుట్టొచ్చేందుకు నలుగురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లిన నాసా ప్రతిష్టాత్మక ‘ఆర్టెమిస్‌ 2’ (Artemis II) మిషన్ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఓరియన్ వ్యోమనౌక తన ప్రధాన ఇంజిన్‌ను మండించి భూ కక్ష్యను వీడి జాబిల్లి దిశగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో నింగి నుంచి నెలవంకలా కనిపిస్తున్న పుడమికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలను ఆర్టెమిస్ 2 క్లిక్‌మనిపించింది. వ్యోమనౌక అంతరిక్షంలోకి వెళుతున్న కొద్దీ భూమి ఒక చిన్న నీలం, తెలుపు రంగుల గోళంలా కుంచించుకుపోయిన దృశ్యాలు మరింత స్ఫూర్తిదాయకంగా మారాయి.

కీలకమైన ‘టీఎల్‌ఐ’ (TLI) దశ సక్సెస్

ఓరియన్ వ్యోమనౌక భూ కక్ష్యలో ఒకరోజు పాటు గడిపిన అనంతరం, ఇంజిన్లు, నావిగేషన్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్‌ను నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని అనుమతులు లభించిన తర్వాత ట్రాన్స్‌లూనార్ ఇంజెక్షన్ (TLI) ద్వారా 5 నిమిషాల 55 సెకన్ల పాటు వ్యోమనౌక ప్రధాన ఇంజిన్‌ను మండించి చంద్రుడి వైపు మళ్లించారు. ఈ ప్రక్రియ అత్యంత అద్భుతంగా, లోపాలు లేకుండా జరిగిందని నాసా అధికారి డాక్టర్ లోరీ గ్లేజ్ స్పష్టం చేశారు.

సరికొత్త రికార్డుల దిశగా ప్రయాణం

1972 తర్వాత మానవులు భూమి కక్ష్య దాటి అంతరిక్షంలోకి వెళ్లడం మళ్లీ ఇదే తొలిసారి. ఆర్టెమిస్-2 చంద్రుడి ఆవలి వైపు (Far side) నుంచి తిరిగి భూమికి చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో వ్యోమనౌక చంద్రుడికి 7,600 కిలోమీటర్ల (4,700 మైళ్లు) దూరం ప్రయాణించనుంది. మానవ సహిత యాత్రలో ఇంత దూరం వెళ్లడం ఇదే ప్రథమం. 1970లో అపోలో-13 నెలకొల్పిన రికార్డును కూడా ఇది బద్దలు కొట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

హర్షం వ్యక్తం చేసిన వ్యోమగాములు

ఈ యాత్ర ద్వారా కెనడాకు చెందిన వ్యోమగామి జెరెమీ హాన్సెన్, అమెరికన్ కాకుండా చంద్రుడి వద్దకు ప్రయాణించిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు. ‘మా ప్రయాణం చాలా సజావుగా సాగుతోంది. ఈ మిషన్ కోసం కష్టపడిన వారి శ్రమను, శక్తిని మేము స్పష్టంగా ఫీల్ అవుతున్నాం. మానవాళి తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకుంది’ అని ఆయన నాసా మిషన్ కంట్రోల్‌కు తెలియజేశారు.

ఆరో రోజున అద్భుతమైన సూర్యగ్రహణం

ప్రయాణంలో సుమారు ఆరో రోజున, ఓరియన్ చంద్రుడిని దాటి వెళుతున్న సమయంలో వ్యోమగాములకు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే అరుదైన అవకాశం దక్కనుంది. ఈ ప్రయాణంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ‘టీఎల్‌ఐ’ దశ పూర్తయినప్పటికీ, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే మొదటి 36 గంటల్లో స్పేస్‌క్రాఫ్ట్‌ను యూ-టర్న్ (U-turn) ద్వారా వేగంగా భూమికి తీసుకువచ్చే అవకాశం ఉందని ఓరియన్ ప్రోగ్రామ్ మేనేజర్ హోవార్డ్ హు తెలిపారు. ఈ 36 గంటలు దాటిన తర్వాత కూడా, తిరిగి భూమికి రావడానికి చంద్రుడి చుట్టూ ప్రయాణించి రావడం సులభతరమని ఆయన వెల్లడించారు. వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావడానికి లక్షలాది సిమ్యులేషన్స్ నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story