- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
40 నిమిషాల పాటు భూమితో సంబంధాలు కట్.. చంద్రుడి అవతలి వైపునకు ఆర్టెమిస్ 2 వ్యోమగాములు
నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్ 2’ మిషన్ అత్యంత కీలక దశకు చేరుకుంది. ఏప్రిల్ 1న నింగిలోకి ఎగిరిన ‘ఓరియన్’ వ్యోమనౌక ఏప్రిల్ 6 వేకువజామున చంద్రుడికి అత్యంత సమీపంగా చేరుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్ 2’ మిషన్ అత్యంత కీలక దశకు చేరుకుంది. ఏప్రిల్ 1న నింగిలోకి ఎగిరిన ‘ఓరియన్’ వ్యోమనౌక ఈ రోజు (ఏప్రిల్ 6) వేకువజామున చంద్రుడికి అత్యంత సమీపంగా చేరుకోనుంది. ఈ చారిత్రక ప్రయాణంలో సుమారు 40 నిమిషాల పాటు నలుగురు వ్యోమగాములకు భూమితో సమాచార సంబంధాలు పూర్తిగా తెగిపోనున్నాయి.
కమ్యూనికేషన్ ఎందుకు కట్ అవుతుంది?
భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 4:17 గంటల ప్రాంతంలో వ్యోమనౌక చంద్రుడి వెనుక భాగానికి (చీకటి వైపునకు) వెళ్తుంది. భూమిపై ఉన్న నాసా డీప్ స్పేస్ నెట్‌వర్క్ నుంచి వెళ్లే రేడియో, లేజర్ సిగ్నల్స్ ప్రయాణానికి చంద్రుడు అడ్డుగా నిలవడం వల్ల కమ్యూనికేషన్ సాధ్యపడదు. సిగ్నల్స్ సరళరేఖలోనే ప్రయాణిస్తాయి కాబట్టి, భారీ పరిమాణంలో ఉండే చంద్రుడిని దాటుకుని అవి వ్యోమనౌకను చేరలేవు. ఇది ముందే ఊహించిన పరిణామమేనని నాసా స్పష్టం చేసింది.
ఆ సమయంలో వ్యోమగాములు ఏం చేస్తారు?
కమాండర్ రీడ్ వైస్‌మన్, పైలట్ విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్టులు క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ ఈ 40 నిమిషాల పాటు నాసా కంట్రోల్ రూమ్ సూచనలు లేకుండా పూర్తిగా ఏకాంతంలో గడపనున్నారు. ఈ సమయాన్ని వారు చంద్రుడి ఉపరితలాన్ని దగ్గర నుంచి ఫోటోలు తీయడానికి, భౌగోళిక విశ్లేషణలు చేయడానికి, ఇతర పరిశోధనా పనుల కోసం వినియోగించనున్నారు.
అపోలో మిషన్‌ను తలపిస్తూ..
దాదాపు 50 ఏళ్ల క్రితం అపోలో 11 మిషన్ సమయంలోనూ వ్యోమగామి మైఖేల్ కాలిన్స్ ఇలాగే 48 నిమిషాల పాటు భూమితో ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఒంటరిగా గడిపారు. ఆ నిశ్శబ్దం తనకు ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆర్టెమిస్ 2 వ్యోమగాములు కూడా అదే తరహా అనుభూతిని పొందనున్నారు. మానవ చరిత్రలో భూమికి అత్యంత దూరంగా ప్రయాణించిన వ్యక్తులుగా వీరు రికార్డు సృష్టించనున్నారు. వ్యోమనౌక తిరిగి చంద్రుడి వెనుక నుంచి బయటకు వచ్చి మళ్లీ కమ్యూనికేషన్ పరిధిలోకి వచ్చే ఆ 40 నిమిషాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.






