హోర్ముజ్ జలసంధిలో యుద్ధ సెగలు.. అమెరికా హెచ్చరికల మధ్య మరో ట్యాంకర్‌పై దాడి

by Ramesh Naini |

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో క్షిపణి దాడులు తీవ్రతరం కావడంతో ఆ ప్రాంతం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది.

హోర్ముజ్ జలసంధిలో యుద్ధ సెగలు.. అమెరికా హెచ్చరికల మధ్య మరో ట్యాంకర్‌పై దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో క్షిపణి దాడులు తీవ్రతరం కావడంతో ఆ ప్రాంతం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. తాజాగా హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న చమురు ట్యాంకర్లపై జరిగిన దాడులు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. గల్ఫ్ రీజియన్‌లో తాజా దాడిలో రెండు విదేశీ చమురు ట్యాంకర్లు భారీ అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఇరాక్ ప్రాదేశిక జలాల్లో జరిగిన ఈ దాడిలో నౌకలు పూర్తిగా మంటల్లో చిక్కుకోగా, సిబ్బంది ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. ఇరాక్ పోర్ట్స్ కంపెనీ సకాలంలో స్పందించి 38 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించింది. దీనికి అదనంగా, ఒమన్ ఓడరేవులోని ఒక ఇంధన ట్యాంక్‌ను ఇరాన్ డ్రోన్ ఢీకొట్టినట్లు సీఎన్ఎన్ (CNN) జియోలొకేటెడ్ వీడియోలు ధృవీకరిస్తున్నాయి.

అమెరికా హెచ్చరిక..

ఇక, హోర్ముజ్ జలసంధి ప్రస్తుతం నౌకల ప్రయాణానికి అత్యంత ప్రమాదకరమైన 'డేంజర్ జోన్'గా మారిందని అమెరికా నౌకాదళం హెచ్చరించింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెంటకీలో జరిగిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ.. ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ‘మేమే గెలిచాం’ అని ఎటువంటి ఆధారాలు చూపకుండానే ప్రకటించడం గమనార్హం. పెరిగే చమురు ధరలను నియంత్రించేందుకు అంతర్జాతీయ నిల్వలను విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం..

ప్రపంచవ్యాప్త ముడి చమురు రవాణాలో ఐదో వంతు (1/5) హోర్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది. బ్రిటన్ మెరైన్ ఏజెన్సీ సమాచారం ప్రకారం.. ఈ మార్గంలో ఇప్పటికే మూడు నౌకలు క్షిపణి దాడులకు గురయ్యాయి. ఈ దాడుల ప్రభావం అంతర్జాతీయ చమురు ధరలపై భారీగా పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story