బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడిపై దారుణం

by Naga Rani Yarlagadda |

బంగ్లాదేశ్ లో శాంతి భద్రతలు రోజురోజుకూ అదుపు తప్పుతున్నాయి. ఇటీవల దీపూ చంద్రదాస్..

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడిపై దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ లో శాంతి భద్రతలు రోజురోజుకూ అదుపు తప్పుతున్నాయి. ఇటీవల దీపూ చంద్రదాస్ అనే యువకుడిని బంగ్లా గ్రూపులు దారుణంగా కొట్టి హతమార్చి, చెట్టుకు వేలాడదీసి దహనం చేశారు. ఈ ఘటన మరువకముందే మరో హిందూ యువకుడిని గ్రామస్తులు కొట్టి చంపిన ఘటన తాజాగా వెలుగుచూసింది. రాజ్ బరి జిల్లాలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు అక్కడి డెయిలీ స్టార్ అనే మీడియా పేర్కొంది. డబ్బు వసూళ్లకు పాల్పడినందుకే గ్రామస్తులు అతనిపై దాడి చేసి చంపినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్ బర్ జిల్లా పంగ్షా సర్కిల్ లో ఈ ఘటన జరిగింది. అమృత్ మొండల్ (29) అలియాస్ సామ్రాట్ పై బుధవారం రాత్రి గ్రామస్తులు దాడి చేయగా.. పోలీసులకు సమాచారం అందింది. అ్కడికి చేరుకున్న పోలీసులు.. తీవ్రగాయాలతో ఉన్న సామ్రాట్ ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ గురువారం తెల్లవారుజామున 2 గంటలకు మరణించాడు. అతని అనుచరుల్లో ఒకడైన మహమ్మద్ సెలిమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. ఒక పిస్టల్, షూటర్ గన్ ను స్వాధీనం చేసుకున్నారు. సామ్రాట్.. సామ్రాట్ బహిన్ పేరుతో.. ఒక క్రిమినల్ గ్యాంగ్ ను రన్ చేస్తున్నాడు. అసాంఘిక కార్యకలాపాలు, డబ్బులు వసూలు చేసేందుకు ఈ గ్యాంగ్ ను పెట్టాడని, అతనిపై హత్యానేరం, రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

షేక్ హసీనా దేశం నుంచి వెళ్లిపోయాక.. సామ్రాట్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని, మళ్లీ ఇటీవలే గ్రామానికి వచ్చాడన్నారు. బుధవారం రాత్రి గ్రామంలోని షాహిదుల్ ఇస్లామ్ ఇంటికెళ్లి డబ్బులివ్వాలని డిమాండ్ చేయడంతో.. కుటుంబీకులు గట్టిగా కేకలు వేశారని, దాంతో గ్రామస్తులు అతడిని బంధించి కొట్టారన్నారు. అతని అనుచరులు పారిపోగా.. మొహమ్మద్ ఒక్కడే దొరికినట్లు తెలిపారు.

Next Story