బంగ్లాదేశ్‌లో దుండగుల దాడి.. చికిత్స పొందుతూ హిందూ వ్యాపారి మృతి

by Naga Rani Yarlagadda |

బంగ్లాదేశ్ లో మరో హిందువు దుండగుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అక్కడి హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

బంగ్లాదేశ్‌లో దుండగుల దాడి.. చికిత్స పొందుతూ హిందూ వ్యాపారి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ లో మరో హిందువు దుండగుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఖోకన్ చంద్రదాస్ (50) అనే వ్యాపారిపై ఇటీవల దుండగులు దాడి చేసి, నిప్పంటించారు. వారి నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు చంద్రదాస్ చెరువులో దూకాడు. ఆ తర్వాత ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఆటో ఆపి.. తలపై పెట్రోల్ పోసి దారుణం

బంగ్లా మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. చంద్రదాస్ క్యూర్ బంగా బజార్లో మందులు అమ్మడంతో పాటు మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇటీవల తన దుకాణాన్ని మూసివేసి ఆటోలో ఇంటికి బయల్దేరగా.. మార్గమధ్యలో కొందరు దుండగులు అడ్డుకుని పదునైన ఆయుధాలతో దాడిచేశారు. తలపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో .. తప్పించుకునేందుకు పక్కనే ఉన్న చెరువులోకి దూకేశాడు. ఆ తర్వాత స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. తమకు శత్రువులెవరూ లేరని, ఎందుకు దాడి చేశారో తెలియదంటూ భార్య సీమా దాస్ ఆవేదన చెందారు.

ఖోకన్ మరణంతో నాలుగుకి చేరిన హిందువుల హత్యలు

కాగా.. బంగ్లాలో విద్యార్థి నాయకుడైన ఉస్మాన్ హాదీ హత్యతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో 2025 డిసెంబరులో దీపూదాస్ అనే హిందూ వ్యక్తి హత్య ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత సామ్రాట్ అనే మరో వ్యక్తి గ్రామస్తుల దాడిలో చనిపోగా.. ఇటీలే బజేంద్ర బిశ్వాస్ అనే ఇంకో వ్యక్తిని తోటి ఉద్యోగి కాల్చి చంపాడు. తాజాగా ఖోకన్ మృతితో.. బంగ్లాలో దాడుల్లో మరణించిన హిందువుల సంఖ్య నాలుగుకి చేరింది. కొద్దిరోజుల్లో అక్కడ ఎన్నికలు జరగనుండగా.. వరుసగా హిందువుల హత్యలు కలకలం రేపుతున్నాయి.

Next Story