- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేనేజర్ల పనిని ఏఐ చేస్తుంది.. 4,000 లేఆఫ్స్ తర్వాత జాక్ డోర్సే షాకింగ్ కామెంట్స్
ప్రముఖ పేమెంట్స్ సంస్థ ‘బ్లాక్’ , ట్విట్టర్ సహ-వ్యవస్థాపకుడు జాక్ డోర్సే కార్పొరేట్ ప్రపంచానికి కీలక సూచన చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ పేమెంట్స్ సంస్థ ‘బ్లాక్’ (Block), ట్విట్టర్ సహ-వ్యవస్థాపకుడు జాక్ డోర్సే కార్పొరేట్ ప్రపంచానికి కీలక సూచన చేశారు. కంపెనీల్లో మిడిల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను పూర్తిగా తొలగించి, ఆ సమన్వయ బాధ్యతలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు అప్పగించాలని ఆయన సూచించారు. ఇటీవల తన సొంత సంస్థలో ఏఐ అప్‌గ్రేడ్ పేరుతో ఏకంగా 4,000 మంది ఉద్యోగులను తొలగించిన కొన్ని వారాలకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒకప్పుడు సమాచారాన్ని కింది స్థాయి నుంచి పై స్థాయికి చేరవేయడానికి వివిధ దశల్లో మేనేజర్ల అవసరం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ సమన్వయ బాధ్యతలను ఏఐ ఎంతో వేగంగా, సమర్థవంతంగా చేయగలదని డోర్సే తన తాజా బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
మేనేజర్ల కంటే ఏఐ మెరుగ్గా చేయగలదు
కంపెనీ పనితీరును ట్రాక్ చేయడం, వర్క్‌ఫ్లోలను అర్థం చేసుకోవడం, వివిధ బృందాల మధ్య సమన్వయం తీసుకురావడం వంటి పనులను మేనేజర్ల కంటే ఏఐ మెరుగ్గా చేయగలదన్నారు. రియల్-టైమ్‌లో వ్యాపార నమూనాను (World model) అప్‌డేట్ చేస్తూ ఏఐ ఈ పనులను చక్కబెడుతుందని తెలిపారు. ఈ విధానాన్ని డోర్సే కేవలం ప్రతిపాదించడమే కాకుండా, ఇప్పటికే అమలు చేస్తున్నారు. ఏఐ పురోగతికి అనుగుణంగా వనరులను పునర్వ్యవస్థీకరించే క్రమంలో.. ఈ ఏడాది ప్రారంభంలో ‘బ్లాక్’ సంస్థ ఏకంగా 4,000 మంది (దాదాపు 40 శాతం) ఉద్యోగులను లేఆఫ్ చేసింది. తమ ఉత్పత్తులైన క్యాష్ యాప్, స్క్వేర్ ద్వారా ప్రతిరోజూ జరిగే మిలియన్ల కొద్దీ లావాదేవీల ద్వారా ‘ఎకనామిక్ గ్రాఫ్’ (వినియోగదారులు, వ్యాపారుల ప్రవర్తన) లభిస్తుందని, ఈ డేటా ఏఐ మోడల్స్‌ను మరింత బలోపేతం చేసి వ్యాపార సమన్వయాన్ని సులభతరం చేస్తోందని డోర్సే వివరించారు.
కొత్త వర్క్ మోడల్ ప్రతిపాదన
శాశ్వత మిడిల్ మేనేజర్లను తొలగించడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవచ్చని తెలిపిన డోర్సే, వారి స్థానంలో కేవలం మూడు రకాల ఉద్యోగులు మాత్రమే ఉండాలని సూచించారు. ఇండివిడ్యువల్ కాంట్రిబ్యూటర్స్ (Individual contributors) సిస్టమ్స్‌ను నిర్మించే నిపుణులు, డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఇండివిడ్యువల్స్ (DRIs) నిర్దిష్ట సమస్యల పరిష్కార బాధ్యతను తీసుకునే వ్యక్తులు. ప్లేయర్-కోచ్‌లు (Player-coaches) తాము స్వయంగా పని చేస్తూనే, తోటివారికి మార్గదర్శనం (మెంటార్‌షిప్) చేసేవారు. మొత్తం మీద, సమాచార మార్పిడికి, ప్రాధాన్యతలను నిర్ణయించడానికి మనుషుల అవసరం లేకుండానే, ఏఐ అద్భుతంగా ఆర్గనైజేషన్ మొత్తాన్ని సమన్వయం చేయగలదని జాక్ డోర్సే స్పష్టం చేశారు. భవిష్యత్తులో కార్పొరేట్ కంపెనీలు ఈ దిశగా ఆలోచించాలని ఆయన సూచించారు.






