సాన్ ఫ్రాన్సిస్కో భారత కాన్సులేట్‌పై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి

by Dishafeatures2 |
సాన్ ఫ్రాన్సిస్కో భారత కాన్సులేట్‌పై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి
X

న్యూఢిల్లీ: ఖలిస్తాన్ మద్దతు దారులు సాన్ ఫ్రాస్కిస్కోలోని భారత కాన్సులేట్‌పై దాడి చేశారు. లండన్‌లోని భారత హై కమిషన్‌పై దాడి చేసిన కొన్ని గంటలకే ఈ దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం సాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేయడాన్ని పంజాబ్ ప్రభుత్వం ఖండించింది. మరోవైపు ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో పార్లమెంట్ భవనం వెలుపల ఖలిస్తాన్ మద్దతుదారులు గుమిగూడి పోలీసుల అణిచివేతకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. లండన్‌లోని భారత హైకమిషన్‌లో విధ్వంసం జరిగిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామాలు సంచలనం రేకెత్తించాయి.

ఖలిస్తాన్ మద్దతుదారులు అనుకూల నినాదాలు చేస్తూ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగిస్తూ లోపలికి ప్రవేశించారు. కార్యాలయ ఆవరణలో రెండు ఖలిస్తాన్ జెండాలను పాతారు. అయితే ఈ జెండాలను కాన్సులేట్ సిబ్బంది త్వరగా అక్కడి నుంచి తీసేసారు. అయితే ఈ మద్దతుదారులు కార్యాలయ గోడపై ‘అమృత్‌పాల్‌ను వదిలిపెట్టండి’ అని పెయింట్ స్ప్రేతో రాశారు. ఈ ఘటనపై సాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు వెంటనే స్పందించలేదు. కానీ అమెరికాలోని భారతీయులు మాత్రం తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.



Next Story