అఫిలియేషన్లలో తీవ్ర జాప్యం.. ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్తు!

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో జూనియర్ కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ అధ్యాన్నంగా తయారైంది. విద్యా సంవత్సరం ప్రారంభమై.. తరగతులు కూడా జరుగుతున్నాయి.

అఫిలియేషన్లలో తీవ్ర జాప్యం.. ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్తు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జూనియర్ కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ అధ్యాన్నంగా తయారైంది. విద్యా సంవత్సరం ప్రారంభమై.. తరగతులు కూడా జరుగుతున్నాయి. అయితే ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల ఉదాసీనత వల్ల అఫిలియేషన్ల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన కాలేజీల అఫిలియేషన్ నోటిఫికేషన్‌ను అకడమిక్ ఇయర్ ప్రారంభానికి నాలుగు నెలల ముందే అంటే ఫిబ్రవరిలో ఇంటర్ బోర్డు విడుదల చేసింది. గతేడాది కంటే నెల రోజుల ముందే ప్రక్రియను ప్రారంభించి, కాలేజీల యాజమాన్యాలకు తగిన సమయం కల్పించినా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తక్కువగా అఫిలియేషన్లు పూర్తవుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ప్రైవేటు కాలేజీల పరిస్థితి మరీ దారుణం

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,403 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అయితే ఇందులో ఇప్పటివరకు కేవలం 210 కాలేజీలకు మాత్రమే అఫిలియేషన్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన వందలాది కాలేజీలు ఇప్పటికీ అనుమతుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఆయా కాలేజీల్లో చేరే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది.

ప్రభుత్వ కాలేజీలదీ అదే బాట..

ప్రైవేట్ కాలేజీల పరిస్థితి ఇలా ఉంటే, ప్రభుత్వ రంగానికి చెందిన కాలేజీల పరిస్థితి కూడా మెరుగ్గా ఏమీ లేదు. రాష్ట్రంలో మొత్తం 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుంటే అందులో 302 కాలేజీలకు అఫిలియేషన్ పూర్తయింది. అలాగే రెసిడెన్షియల్ కాలేజీలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్ లాంటి 1,500 ప్రభుత్వ సెక్టార్ కాలేజీలు అందుబాటులో ఉండగా, వీటిలో కేవలం 800 కాలేజీలకు మాత్రమే ఇప్పటివరకు అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మిగిలిన 700 ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి ఈ ప్రక్రియ ఇంకా పెండింగులోనే ఉంది. అధికార యంత్రాంగం వెంటనే స్పందించి, యుద్ధప్రాతిపదికన తనిఖీలను పూర్తి చేసి, కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

Next Story