అక్రమాలకు టౌన్ ప్లానింగ్ అండ!

by Ajay Maddhiboyina |

పట్టణంలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్రమాలకు టౌన్ ప్లానింగ్ అండ!
X

దిశ, శంషాబాద్ : పట్టణంలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రధాన రహదారుల వెంట భారీ భవనాలు, వాణిజ్య సముదాయాలు, ఫంక్షన్ హాల్స్ నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అనుమతి లేని ఫంక్షన్ హాల్..

అనుమతులు లేని గృహ నిర్మాణాలతో పాటు వాణిజ్య సముదాయాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శంషాబాద్ పట్టణంలోని తొండుపల్లి వెళ్లే దారిలో బెంగళూరు ప్రధాన రహదారికి పక్కనే ఓ వ్యాపారి ఓ బడా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టాడు. సుమారు ఆరు నెలలుగా నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టడంతో చేతులు ముడుచుకొని కూర్చున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు అక్రమ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లోని కొందరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రతి నిర్మాణం నుంచి భారీగా వసూళ్ల పర్వానికి దిగినట్లు సమాచారం. రహదారి పక్కనే 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్న ఫంక్షన్ హాల్‌పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ నిర్మాణాలకు అడ్డా..

శంషాబాద్ పట్టణంలోని సుమారు 90 శాతం ప్రాంతం 111 జీవో పరిధిలో ఉంది. ఇక్కడ రూల్స్ ప్రకారం ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. శంషాబాద్‌లోని పాత గ్రామంతో పాటు పట్టణంలో వెలిసిన కాలనీలో వందల సంఖ్యలో నిర్మాణాలు పుట్టుకొస్తున్న మున్సిపల్ అధికారులు మౌనవ్రతం పాటిస్తున్నారు. గతంలో 111 జీవో పరిధిలో నిర్మాణాల విషయంలో కఠిన నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటిని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు వచ్చినా అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై వెంటనే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్తులో పట్టణ ప్రణాళికకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అవును.. అనుమతులు లేవు..

తొండుపల్లి రహదారిలో ఫంక్షన్ హాల్‌కు ఎలాంటి అనుమతులు లేవని టౌన్ ప్లానింగ్ ఏసీపీ లాలప్ప స్పష్టం చేశారు. అదేవిధంగా శంషాబాద్ పట్టణంలోని చాలా ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొనడం గమనార్హం. మరి చర్యలు తీసుకోవాలి కదా? అని ఆయన అడుగగా ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

Next Story