- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోదరుడే మాట వినలేదు! ఢిల్లీ హైకోర్టులో నటి సెలీనా జైట్లీకి చుక్కెదురు
ఢిల్లీ హైకోర్టులో నటి సెలీనా జైట్లీకి చుక్కెదురైంది. యూఏఈ (UAE)లో నిర్బంధంలో ఉన్న తన సోదరుడు విక్రాంత్ జైట్లీతో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని, అతనికి న్యాయ సహాయం అందించేలా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు పరిష్కరించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: యూఏఈలో నిర్బంధంలో ఉన్న తన సోదరుడితో సంప్రదింపులు జరిపేందుకు అనుమతించాలన్న నటి సెలీనా జైట్లీ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. తన సోదరితో మాట్లాడేందుకు విక్రాంత్ జైట్లీ నిరాకరించడమే ఇందుకు ప్రధాన కారణం అని తెలిసింది. జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి, తాజా పరిస్థితుల దృష్ట్యా కేసును ముగించింది.
9 సార్లు కాన్సులర్ యాక్సెస్.. కానీ!
రిటైర్డ్ మేజర్ విక్రాంత్ జైట్లీ అరెస్ట్ అయినప్పటి నుంచి భారత రాయబార కార్యాలయం ద్వారా అతనికి ఇప్పటివరకు 9 సార్లు కాన్సులర్ యాక్సెస్ (ప్రభుత్వ ప్రతినిధుల భేటీ) కల్పించినట్లు కోర్టు గుర్తించింది. అయితే, తన సోదరి సెలీనా జైట్లీతో మాట్లాడటం తనకు ఇష్టం లేదని, ఆమె ద్వారా ఎలాంటి న్యాయ సహాయం అవసరం లేదని విక్రాంత్ స్పష్టం చేసినట్లు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం నివేదిక సమర్పించింది. తనకు సంబంధించిన చట్టపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం కేవలం తన భార్యకు మాత్రమే ఉంటుందని విక్రాంత్ వెల్లడించినట్లు అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ASG) చేతన్ శర్మ కోర్టుకు వివరించారు.
న్యాయ సహాయంపై కోర్టు ఆదేశాలు
విక్రాంత్ జైట్లీ తరఫున వాదించేందుకు అబుదాబికి చెందిన ‘ఖలీద్ అల్ మారీ అండ్ పార్ట్‌నర్స్’ అనే లా ఫర్మ్ ఉచితంగా (ప్రో బోనో) ముందుకు వచ్చింది. ఒకవేళ విక్రాంత్‌కు ఈ సంస్థ సేవలు ఇష్టం లేకపోతే, అతను కోరుకున్న మరో సంస్థను ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. సోదరుడి విడుదల కోసం సెలీనా జైట్లీ, ఆమె వదిన చారుల్ జైట్లీ కలిసి పని చేయాలని గత విచారణలో కోర్టు సూచించిన సంగతి తెలిసిందే. యూఏఈలో ఏడాదికి పైగా నిర్బంధంలో ఉన్న తన సోదరుడి క్షేమ సమాచారం తెలియడం లేదని, అతనికి సరైన న్యాయ సహాయం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ సెలీనా జైట్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, సోదరుడే స్వయంగా సంప్రదింపులకు విముఖత చూపడంతో హైకోర్టు ఈ పిటిషన్‌పై తదుపరి చర్యలను నిలిపివేసింది.






