- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
H-1B వివాదానికి గట్టి సమాధానం.. టెక్సాస్ సిటీ కౌన్సిల్‌లో భారత సంతతి యువతి సంచలన ప్రసంగం
అమెరికాలో హెచ్-1బీ (H-1B) వీసాలు, భారతీయ నిపుణుల ప్రాబల్యంపై అప్పుడప్పుడూ వ్యక్తమయ్యే వ్యతిరేకతకు ఓ భారత సంతతి యువతి దీటుగా బదులిచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలో హెచ్-1బీ (H-1B) వీసాలు, భారతీయ నిపుణుల ప్రాబల్యంపై అప్పుడప్పుడూ వ్యక్తమయ్యే వ్యతిరేకతకు ఓ భారత సంతతి యువతి దీటుగా బదులిచ్చారు. స్థానికుల భయాలను పోగొడుతూ, భారతీయ విలువల ఔన్నత్యాన్ని చాటుతూ టెక్సాస్‌లోని ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ సమావేశంలో నేహా సూరత్రన్ (Neha Suratran) అనే యువతి చేసిన ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భారతీయ నిపుణుల వల్ల స్థానిక వర్గాలకు ముప్పు ఉందంటూ వస్తున్న విమర్శలను నేహా గణాంకాలతో సహా తిప్పికొట్టారు. ‘గణాంకాలను బట్టి చూస్తే.. భారతీయ సమాజం ఉన్నత విద్య, అధిక ఆదాయం, అతి తక్కువ నేరాల రేటుతో ముడిపడి ఉంది. సురక్షితమైన పరిసరాలు, మెరుగైన పాఠశాలలు, ఉన్నత ఆర్థిక పురోగతికి కారణమయ్యే ఒక వర్గాన్ని చూసి ఎందుకు భయపడాలి?’ అని ఆమె కౌన్సిల్ వేదికగా ప్రశ్నించారు. మీ పిల్లలు సురక్షితమైన వాతావరణంలో, అత్యుత్తమ పనితీరు కనబరిచే పాఠశాలల్లో, స్థిరమైన సమాజంలో పెరగాలని కోరుకుంటే.. భారతీయులను చూసి భయపడటం కాదు, వారిని సాదరంగా స్వాగతించాలి అని ఆమె స్పష్టం చేశారు.
బలవంతపు మతమార్పిడులకు తావులేదు..
అమెరికాలో సాంస్కృతిక అస్తిత్వం, మతం గురించి వస్తున్న అపోహలను కూడా నేహా గట్టిగా ఖండించారు. ‘నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మేము ఎవరి మతాన్నీ మార్చడానికి ప్రయత్నించము. హిందూ మతం బలవంతపు మతమార్పిడులను అస్సలు ప్రోత్సహించదు. మంచి వ్యక్తిగా జీవిస్తే చాలు.. ఎవరైనా స్వర్గానికి వెళ్తారు. ఇక మా సంప్రదాయాలతో పాటు స్థానిక పండుగలైన థాంక్స్ గివింగ్, క్రిస్మస్ వంటి వాటిని కూడా మేము ఎంతో సంతోషంగా కలిసిమెలిసి జరుపుకుంటాం’ అని ఆమె పేర్కొన్నారు.
ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు
ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియోను శశాంక్ మట్టూ అనే నెటిజన్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పంచుకోగా, అది క్షణాల్లో వైరల్‌గా మారింది. పరస్పర గౌరవం, సహజీవనం అనే భారతీయ విలువలను అంతర్జాతీయ వేదికపై అత్యద్భుతంగా చాటిచెప్పారని నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పరస్పర గౌరవం అనేది ఏ సమాజానికైనా పునాది. సహజీవనం అనే భారతీయ విలువను ప్రపంచ వేదికపై గర్వంగా ప్రదర్శించారు’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ‘హిందువులకు, ఇతర మతాలకు ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే. వారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తమ అత్యుత్తమ సేవలను అందించి ఆ దేశ శ్రేయస్సుకు, అభివృద్ధికి తోడ్పడతారు’ అని మరొకరు ప్రశంసించారు.






