బాధ్యత మరింత పెరిగింది.. ఇకపై నా కొడుకు గర్వపడే సినిమాలే చేస్తానంటున్న కాజల్ అగర్వాల్

by Mallepaka Hamsa |

ఇప్పుడు ఏ కథ విన్నా తన కొడుకు కోణంలోనే ఆలోచిస్తున్నానని, భవిష్యత్తులో అమ్మ చాలా మంచి సినిమా చేసిందని వాడు గర్వంగా చెప్పుకోవాలనేదే తన తాపత్రయమని తెలిపారు.

బాధ్యత మరింత పెరిగింది.. ఇకపై నా కొడుకు గర్వపడే సినిమాలే చేస్తానంటున్న కాజల్ అగర్వాల్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లై ఓ బిడ్డకు తల్లి అయ్యాక సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తున్నారు. అచీతూచీ అడుగులు వేస్తూ.. భారీ చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఆమె తల్లి అయిన తర్వాత వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం కాజల్ నటించిన 'ది ఇండియా స్టోరీ', 'రామాయణ' వంటి భారీ ప్రాజెక్టులు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రలో నటించిన 'ది ఇండియా స్టోరీ' సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రమోషన్స్‌లో కాజల్ పాల్గొని, తన వ్యక్తిగత జీవితం, మూవీస్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను తల్లి అయిన తర్వాత సినిమాలు ఎంచుకునే పద్ధతి పూర్తిగా మారిపోయిందని కాజల్ చెప్పారు. కొడుకు నీల్ పుట్టిన తర్వాత తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఇప్పుడు ఏ కథ విన్నా తన కొడుకు కోణంలోనే ఆలోచిస్తున్నానని, భవిష్యత్తులో అమ్మ చాలా మంచి సినిమా చేసిందని వాడు గర్వంగా చెప్పుకోవాలనేదే తన తాపత్రయమని తెలిపారు.

అందుకే ఎలాంటి చిత్రాలు చేయాలనే దానిపై తనకు ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చిందని చెప్పారు. తన కొడుకు నీల్‌కు రామాయణం కథ అంటే చాలా ఇష్టమని, ఇంట్లో రోజూ రామలీలా చూస్తుంటాడని కాజల్ వెల్లడించారు. తాను నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ‘రామాయణ’ సినిమాలో మండోదరి పాత్ర చేస్తున్నానని చెప్పగానే వాడు ఎంతో సంబరపడిపోయాడని చెప్పారు. నీల్‌కు అన్నిటికంటే రావణుడి పాత్రే ఎక్కువ ఇష్టమని తెలిపారు. ఈ సినిమా రెండో భాగం వచ్చేసరికి వాడికి ఐదేళ్లు వస్తాయని, థియేటర్‌లో వాడు చూడబోయే మొదటి చిత్రం ఇదే అవుతుందని కాజల్ చెప్పుకొచ్చారు. అలాగే 'ది ఇండియా స్టోరీ' సినిమా గురించి మాట్లాడుతూ.. కల్తీ ఆహారం, పురుగుల మందుల వాడకం వల్ల ప్రజల ప్రాణాలు ఎలా పోతున్నాయనే పాయింట్ ఇందులో చూపించారని కాజల్ తెలిపారు. ఈ కథ విన్నాక తనే స్వయంగా రీసెర్చ్ చేసి, వంటగదిలో ఏ వస్తువులు ఉంచాలి, తన కొడుకుకు ఎలాంటి ఆహారం ఇవ్వకూడదనే విషయాలపై కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు.

Next Story