- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో ‘ఈ-25 పెట్రోల్’ లాంచ్ వార్తలు.. తీవ్రంగా ఖండించిన కేంద్రం
దేశంలో 25 శాతం ఇథనాల్ కలిపిన ‘ఈ-25 పెట్రోల్’ను లాంచ్ చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం శాఖ కొట్టిపడేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా 25 శాతం ఇథనాల్ (Ethanol) కలిపిన ‘ఈ-25’ పెట్రోల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం (Govt. Of India) పూర్తిగా ఖండించింది. అలాంటి ప్రచారాలు ముమ్మాటికీ అబద్ధమని అని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో 20 శాతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ విజయవంతంగా అమలువుతున్న వేళ అదే లక్ష్యాన్నే మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించిందని తెలిపింది. కానీ, అంతకు మించి ఈ-25 పెట్రోల్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలోనే లేదని సంబంధిత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
కాగా, గత రెండు, మూడు రోజుల నుంచి జాతీయ మీడియా (National Media)తో పాటు సోషల్ మీడియా (Social Media) వేదికల్లో, త్వరలోనే దేశంలో వాహనాల కోసం ఈ-25 పెట్రోల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. దీంతో ఇంధన ధరలు, వాహనాల ఇంజన్ సామర్థ్యంలో మార్పులు వస్తాయంటూ కథనాలు ప్రసారం అయ్యాయి. తాజాగా ఈ ప్రచారంపై పెట్రోలియం శాఖ స్పందిస్తూ.. ప్రజలు, వాహనదారులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని, ఒకవేళ ఏదైనా ఉంటే సంబంధిత మంత్రిత్వ శాఖనే ప్రకటన విడుదల చేస్తుందని అధికారులు స్పష్టం చేశారు. .






