తెలంగాణ టూరిజం అభివృద్ధికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేయండి: మంత్రి జూపల్లి ఆదేశం

by Prasad Jukanti |

తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు సమగ్ర రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.

తెలంగాణ టూరిజం అభివృద్ధికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేయండి: మంత్రి జూపల్లి ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగాన్ని (Telangana Tourism) ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు, రాష్ట్రంలోని పర్యాటక సంపదను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఒక సమగ్రమైన, ఆచరణాత్మకమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, సరికొత్త పర్యాటక అనుభవాలు, పటిష్టమైన మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, సమర్థవంతమైన మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ టూరిజం అభివృద్ధి మరియు ప్రమోషన్‌పై నిర్వహించిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణకు ఉన్న గొప్ప వారసత్వం, సంస్కృతి, అడవులు, వన్యప్రాణులు, నదులు, జలాశయాలను క్రమబద్ధమైన ప్రణాళికల ద్వారా పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

అమ్రాబాద్, కావల్ టైగర్ రిజర్వులకు ప్రత్యేక ప్రణాళిక

కొత్త టూరిజం డెస్టినేషన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. అమ్రాబాద్, కావల్ టైగర్ రిజర్వులను బండీపూర్ వంటి విజయవంతమైన ఎకో-టూరిజం నమూనాలను అధ్యయనం చేసి అభివృద్ధి చేయాలని మంత్రి ఆదేశించారు. చెంచు సంస్కృతి, కాకతీయ కాలం నాటి దేవాలయాలు, స్థానిక పండుగలు, ప్రకృతి అందాలను కలిపి ప్రత్యేక ఎకో-టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను వేగవంతం చేసేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక ఇన్వెస్టర్ల సమావేశం నిర్వహించాలని మంత్రి ప్రతిపాదించారు. అభివృద్ధికి అనువైన పర్యాటక ప్రాంతాలను గుర్తించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

గ్రాండ్ టూరిజం కార్నివల్‌కు ప్రతిపాదన

తెలంగాణ సంస్కృతి, వారసత్వం, వంటకాలు, కళలు, వినోదాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా గ్రాండ్ టూరిజం కార్నివల్ నిర్వహించే ప్రతిపాదనను మంత్రి సమీక్షించారు. దీనిని దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే భారీ కార్యక్రమంగా రూపొందించాలని అధికారులకు సూచించారు. దుబాయ్‌లోని గ్లోబల్ విలేజ్ తరహా నమూనాలను అధ్యయనం చేసి తెలంగాణకు అనువైన విధానాన్ని రూపొందించాలన్నారు.

హైదరాబాద్‌లో కొత్త టూరిజం ఆకర్షణలు

హైదరాబాద్‌లో పర్యాటకులను ఆకట్టుకునేలా సిటీ టూర్ బస్సులు, బావుల ఉత్సవం (బావోలి ఫెస్టివల్), హెరిటేజ్ వాక్స్, నైట్ బజార్లు, సౌండ్ అండ్ లైట్ షోలు, వింటేజ్ కార్ల మ్యూజియం ఏర్పాటు వంటి ప్రతిపాదనలను సమావేశంలో చర్చించారు. పుట్లిబౌలి, కోటి, చార్మినార్, లాడ్‌బజార్ ప్రాంతాల్లో హెరిటేజ్ వాక్స్ నిర్వహించి నగర చరిత్ర, నిర్మాణ శైలి, సంస్కృతి, వంటకాలను పర్యాటకులకు పరిచయం చేయాలని సూచించారు. సోమశిలలో ఉన్న సుమారు 1,600 ఎకరాల భూమిని సమర్థవంతంగా వినియోగించేందుకు సమగ్ర అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.

Next Story