SEBI: బైబ్యాక్‌లపై సెబీ కొత్త రూల్స్

by S Gopi |

కంపెనీలు ప్రత్యేక బైబ్యాక్ విండో అవసరం లేకుండా సాధారణ ట్రేడింగ్ ద్వారా తమ సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేయవచ్చు.

SEBI: బైబ్యాక్‌లపై సెబీ కొత్త రూల్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్‌లను తిరిగి అనుమతిస్తూ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇవి ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త విధానం ప్రకారం కంపెనీలు ప్రత్యేక బైబ్యాక్ విండో అవసరం లేకుండా సాధారణ ట్రేడింగ్ ద్వారా తమ సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేయవచ్చు. అయితే మొత్తం బైబ్యాక్ విలువ కంపెనీ చెల్లించిన మూలధనం, ఫ్రీ రిజర్వులలో 15 శాతాన్ని మించకూడదు. వ్యాపారాలు మరింత సులభంగా సాగేందుకు (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వీలుగా సెబీ ఈ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేసింది. గతంలో ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఆరు నెలల వరకు సమయం ఉండగా, ఇకపై 66 పనిదినాల్లోనే బైబ్యాక్ పూర్తి చేయాలి. అంతేకాకుండా, కంపెనీల ఖర్చులను తగ్గించడానికి ఇకపై బైబ్యాక్ కోసం మర్చంట్ బ్యాంకర్‌ను నియమించుకోవడం కంపెనీల ఇష్టానికే వదిలేసింది. పన్నుల పరంగా కూడా సరికొత్త 'క్యాపిటల్ గెయిన్' ఫ్రేమ్‌వర్క్‌ను తెచ్చింది. దీని ప్రకారం బైబ్యాక్‌లో షేర్లు అమ్మే పబ్లిక్ ఇన్వెస్టర్లు సాధారణ మార్కెట్లో అమ్మినట్లే తమ వాస్తవ లాభాలపై పన్ను కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల గతంలో ఉన్న పన్ను వ్యత్యాసాలు తొలిగిపోయాయి. ఇన్వెస్టర్లకు సమాచారం చేరవేయడానికి పేపర్ ప్రకటనలతో పాటు డిజిటల్ మాధ్యమాలను వాడుకోవాలని సెబీ స్పష్టం చేసింది. అలాగే, బైబ్యాక్ సమయంలో ప్రమోటర్ల షేర్లను స్తంభింపజేయడం (ఫ్రీజ్), కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనలు ఉల్లంఘించకుండా స్పష్టమైన రక్షణ చర్యలను సెబీ ఈ కొత్త చట్టంలో చేర్చింది.

Next Story