- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప్పల్‌లో 'బాలామృత' ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్.. మహిళా సాధికారతపై కీలక వ్యాఖ్యలు
"గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డలు సుఖశాంతులతో, ఆరోగ్యంతో జన్మిస్తారు. భావితరాల ఆరోగ్యమే లక్ష్యంగా, పేద పిల్లలకు పౌష్టికాహారం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, మేడ్చల్ బ్యూరో: "గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డలు సుఖశాంతులతో, ఆరోగ్యంతో జన్మిస్తారు. భావితరాల ఆరోగ్యమే లక్ష్యంగా, పేద పిల్లలకు పౌష్టికాహారం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్‌లో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 21 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న అత్యాధునిక 'బాలామృత' ఉత్పత్తి కేంద్రాన్ని మంత్రి సీతక్కతో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు.
చారిత్రక స్ఫూర్తితోనే ఈ ప్లాంట్ ఆనాడు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ మహబూబ్‌నగర్‌లో శ్రీకారం చుట్టిన పోషకాహార కార్యక్రమం, నేడు అంచెలంచెలుగా ఎదిగి ఉప్పల్ నియోజకవర్గంలో భారీ పరిశ్రమగా విస్తరించడం గర్వకారణమని సీఎం అభివర్ణించారు. ఈ కేంద్రం తెలంగాణకే కాకుండా, పొరుగున ఉన్న నాలుగైదు రాష్ట్రాలకు అవసరమైన పౌష్టికాహారాన్ని సరఫరా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన తెలిపారు.
2034 నాటికి కోటి మంది కోటీశ్వరులు..
మహిళలను కేవలం ఇంటికే పరిమితం చేయకుండా, పరిపాలనలో, వ్యాపారాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నామని సీఎం చెప్పారు. "2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే నా లక్ష్యం" అని ఆయన ప్రకటించారు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు నెలకు రూ.10,000 ఆదా అవుతోందని, ఇందుకోసం ప్రభుత్వం 30 నెలల్లోనే రూ.11,000 కోట్లు ఆర్టీసీకి చెల్లించిందని వివరించారు. మహిళలకు పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు, ఇందిరా మహిళా శక్తి నైట్ బజార్ వంటి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం..
ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలు ఆకలితో చదువును కోల్పోకూడదని నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. వంట నాణ్యతను పెంచేందుకు, ఉపాధ్యాయులు కూడా పిల్లలతో కలిసే భోజనం చేయాలని చట్టం చేశామని ఆయన చెప్పారు. దీనికోసం ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 27,000 కోట్లు విద్యార్థుల కోసం వెచ్చిస్తోందని స్పష్టం చేశారు.
రాజకీయాలకు అతీతంగా ఉప్పల్ అభివృద్ధి..
గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి ఆశించిన స్థాయిలో నిధులు తీసుకురాలేకపోయానని, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆ లోటును తీరుస్తానని సీఎం హామీ ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధుల సూచన మేరకు, రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
దేశంలోనే అరుదైన ప్లాంట్: మంత్రి సీతక్క
ముఖ్యమంత్రి ప్రసంగానికి ముందు మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చిన్నారులు, గర్భిణుల కోసం పౌష్టికాహారాన్ని అత్యంత నాణ్యంగా తయారు చేస్తున్నామని తెలిపారు. గతం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూముల్లోనే ఈరోజు చిన్నారుల ఆరోగ్యం కోసం ఇంతటి భారీ అసెట్స్ సృష్టించడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి అత్యాధునిక ప్లాంట్లు దేశంలోనే అరుదని, దీని ద్వారా లక్షలాది మందికి పౌష్టికాహారం అందుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లు అద్దంకి దయాకర్,బల్మూర్ వెంకట్,ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఎఫ్. ఫహీం, కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి, డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ పరమేశ్వర్ రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.






