కాలువ‌ల నిర్వ‌హ‌ణ లోపంతో వ‌ర‌ద‌లు

by velandi.Saikiran |

చెరువులు, వ‌ర‌ద కాలువలు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి కాకుండా కాపాడితే చాలా వ‌ర‌కు వ‌ర‌ద‌ను నియంత్రించ‌వ‌చ్చు’ అని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తెలిపారు.

కాలువ‌ల నిర్వ‌హ‌ణ లోపంతో వ‌ర‌ద‌లు
X

కాలువ‌ల నిర్వ‌హ‌ణ లోపంతో వ‌ర‌ద‌లు

స‌హ‌జ ప్ర‌వాహాలు కొన‌సాగితే వ‌ర‌ద‌ల‌కు క‌ట్ట‌డి

ఐఏఎస్ అధికారుల‌ శిక్ష‌ణలో హైడ్రా క‌మిష‌న‌ర్ దిశానిర్దేశం

దిశ, తెలంగాణ బ్యూరో: న‌గ‌రాల్లో వ‌ర‌ద‌లు స‌ర్వ‌సాధార‌ణంగా మారాయి. వాతావ‌ర‌ణ మార్పుల‌తో కుంభ‌వృష్టి వ‌ర్షాలకు తోడు వ‌ర‌ద కాలువ‌ల నిర్వ‌హ‌ణ‌లో ఉన్న లోపాలు కూడా వ‌ర‌ద‌ల‌కు కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇలాంటి త‌రుణంలో గొలుసుక‌ట్టు చెరువుల ప‌రిర‌క్ష‌ణ ఎంతో ముఖ్య‌మ‌ని దేశంలోని ఏ న‌గ‌రాన్ని ప‌రిశీలించినా అర్థ‌మౌతోంది. స‌హ‌జ వ‌ర‌ద ప్ర‌వాహానికి ఆటంకం క‌ల‌గ‌కుండా చూడాల్సినవ‌స‌రం న‌గ‌రాన్ని ముంచెత్తుతున్న వ‌ర‌ద‌లు గుర్తు చేస్తున్నాయి. చెరువులు, వ‌ర‌ద కాలువలు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి కాకుండా కాపాడితే చాలా వ‌ర‌కు వ‌ర‌ద‌ను నియంత్రించ‌వ‌చ్చు’ అని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తెలిపారు. ‘న‌గ‌రాల్లో వ‌ర‌ద ముప్పు త‌ప్పించ‌డం విపత్తు నిర్వహణకు వ్యూహాలు’ అనే అంశంపై మంగ‌ళ‌వారం హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో మాట్లాడారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చెందిన ప‌ట్ట‌ణాభివృద్ధి, ప‌రిపాల‌న‌, టౌన్‌ప్లానింగ్‌ శాఖ‌ల‌లో ప‌ని చేస్తున్న ఐఏఎస్ అధికారుల సామర్థ్యాభివృద్ధి కోసం నిర్వ‌హించిన శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో వ‌ర‌ద‌ల‌కు గ‌ల కార‌ణాలు.. వాటి క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ సూచించారు. హైడ్రా ఆవిర్భావం.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌తో పాటు.. వ‌ర‌ద‌ల నివార‌ణ‌కు హైడ్రా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌ద‌ర్శ‌న ద్వ‌ారా వివ‌రించారు.

చెరువులు, నాలాల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించ‌డంతో పాటు.. పార్కులు, ర‌హ‌దారులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌కు హైడ్రా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను వివిధ రాష్ట్రాల నుంచి వ‌చ్చిన ఐఏఎస్ అధికారులు అభినందించారు. క‌బ్జాల‌ను తొల‌గించి రెండేళ్ల‌లో 2471 ఎక‌రాలు కాపాడ‌డం సామాన్య‌మైన విష‌యం కాద‌ని ప‌లువురు పేర్కొన్నారు. వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నా..ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌లేక చాలా ప‌ట్ట‌ణాలు అవ‌స్థ‌లు ప‌డుతుంటే.. హైద‌రాబాద్‌లో రెండేళ్ల‌లో చెరువులు, నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌ను 480 ఎక‌రాల‌కు పైగా తొల‌గించ‌డం సామాన్యమైన విష‌యం కాద‌ని ప‌లువురు ప్ర‌శంసించారు. చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ‌లో సాంకేతిక ప‌రిజ్ఞాన‌ వినియోగంపై ఆరా తీశారు. కోర్టు కేసుల గురించి తెలుసుకున్నారు. ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన‌ప్పుడు రాజ‌కీయ ఒత్తిడిలను ఎలా అధిగ‌మిస్తున్నారంటూ సందేహాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ద్వ‌రా నివృత్తి చేసుకున్నారు.

సహజ నీటి ప్రవాహల‌ను కాపాడుకుందాం..

‘బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల పరిస్థితిని పరిశీలిస్తే ఒకే విషయం స్పష్టమవుతోందన్నారు. సహజ నీటి ప్రవాహ మార్గాలు, చెరువులు, నదులు, చిత్తడి భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నగరాల సహజ జలవ్యవస్థ దెబ్బతిందని తెలిపారు. నీటిని భూమిలో ఇంకే సహజ వ్యవస్థలను తొలగించి, వాటి స్థానంలో పరిమిత సామర్థ్యం ఉన్న కాంక్రీట్ కాలువలను నిర్మించడం వల్ల అధిక వర్షపాతం సంభవించిన ప్రతిసారి పట్టణాలు తీవ్రమైన వరదలను ఎదుర్కొంటున్నాయని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తెలిపారు. లేక్ సిటీగా పేరుగాంచిన బెంగ‌ళూరులో చెరువులు, రాజ కాలువ‌లు ఆక్రమణలకు గురై, వెడల్పు తగ్గి చిన్న కాంక్రీట్ కాలువలయ్యాయని గుర్తుచేశారు. బెంగ‌ళూరే కాదు.. అన్ని న‌గ‌రాల్లో సుమారు 80–90 శాతం భూభాగం కాంక్రీటీకరణ కావడంతో వర్షపు నీరు భూమిలో ఇంకకుండా నేరుగా కాలువల్లోకి చేరి ర‌హ‌దారుల‌ను, నివాసాల‌ను ముంచెత్తుతోందని తెలిపారు. ఇక దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో ప్రధాన వర్షపు నీటి మార్గమైన మిథి నది ఆక్రమణలు, చెత్త, నిర్మాణ వ్యర్థాలతో వెడల్పు, లోతు కోల్పోయిందని తెలిపారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ గంటకు 25 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే తట్టుకునేలా రూపకల్పన చేయబడిందని, ప్రస్తుతం గంటకు 50–100 మిల్లీమీటర్లకుపైగా వర్షం నమోదవుతోంది. భారీ వర్షాలు, సముద్రంలో ఆటుపోట్లు ఒకేసారి వచ్చినప్పుడు సముద్రంలోకి నీటిని విడుదల చేయడం సాధ్యం కాక నగరంలో వ‌ర‌ద ముంచెత్త‌డం స‌హ‌జంగా మారిందన్నారు. యమునా నది వరద మైదానాల ఆక్రమణ, పాత డ్రైనేజీ వ్యవస్థ, 1976లో 60 లక్షల జనాభా కోసం రూపొందించిన డ్రైనేజీ మాస్టర్ ప్లాన్‌.. ఢిల్లీ జ‌నాభా నాలుగు రెట్లు పెరిగినా డ్రైనేజీ వ్యవస్థలో తగిన మార్పులు జరగలేద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ చెప్పారు.

కాలువ‌ల నిర్వ‌హ‌ణ‌కు ప్రాధాన్య‌మివ్వాలి..

‘ఇక తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ కూడా పైన పేర్కొన్న న‌గ‌రాల‌కు అతీతం కాదు.. గొలుసుక‌ట్టు చెరువుల‌కు పెట్టింది పేరైన న‌గ‌రంలో వ‌ర‌ద‌లు సాధార‌ణంగా మారాయి. ఇలాంటి త‌రుణంలో న‌గ‌రంలో చెరువుల‌తో పాటు.. వ‌ర‌ద కాలువ‌ల‌ను ప‌రిర‌క్షించ‌డంతో పాటు వాటి నిర్వ‌హ‌ణ‌కు హైడ్రా ప్రాధాన్య‌త‌నిస్తోంది. చెరువుల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం సాహ‌సోపేత‌మైన చ‌ర్యే అయిన‌ప్ప‌టికీ హైడ్రా వెనుకాడ‌డంలేదు. మొద‌టి విడ‌త 6 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌లో 75 ఎక‌రాల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి విస్త‌రించాం. పూడిక‌ను పెద్ద‌మొత్తంలో తొల‌గించ‌డంతో పాటు.. ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు అభివృద్ధి చేయ‌డంతో ఆ ప‌రిస‌రాలకు వ‌ర‌ద ముప్పు త‌ప్పించాం. మ‌రో 14 చెరువుల‌ను హైడ్రా పున‌రుద్ధ‌రిస్తోంది. ఇక్క‌డ కూడా ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి దాదాపు 150 ఎక‌రాల‌కు పైగా కాపాడుతున్నాం. వ‌ర్షాకాలంలో హైడ్రా డిజాస్ట‌ర్ రెస్పాన్స్ టీమ్‌లతో పాటు..మాన్సూన్ రెస్పాన్స్ టీంలు ప్ర‌త్యేకంగా ప‌ని చేస్తున్నాయి. చెరువుల‌ను అనుసంధానం చేసే వ‌ర‌ద కాలువ‌ల్లో పూడిక‌ను తొల‌గించే కార్య‌క్ర‌మాలు పెద్ద‌యెత్తున జ‌రుగుతున్నాయి. సికింద్రాబాద్ వంటి ప్ర‌ధాన ప్రాంతంలో ప్యాట్నీ నాలాపై ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించ‌డంతో పైన ఉన్న‌8 కాల‌నీల‌కు వ‌ర‌ద ముప్పు త‌ప్పించాం. అలాగే అమీర్‌పేట‌లో పూడుకుపోయిన భూగ‌ర్భ పైపుల‌ను క్లీన్ చేసి వ‌ర‌ద ముంచెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నాం. ఇలా అనేక ఉదాహ‌ర‌ణ‌లు ఇప్పుడు న‌గ‌ర‌వాసులు ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నారు. ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించ‌డంలో హైడ్రాకు స‌హ‌క‌రిస్తున్నారు. హైడ్రా చ‌ర్య‌ల‌ను స్వాగ‌తిస్తున్నార‌ు’ అని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్ చెప్పారు.

Next Story