- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారుమూల ప్రాంతాల ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు
మారుమూల గ్రామాల ప్రజలకు 24 గంటల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

దిశ, ఖానాపూర్ : మారుమూల గ్రామాల ప్రజలకు 24 గంటల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో మంగళవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆకస్మికంగా పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), గ్రామపంచాయతీ కార్యాలయాలను తనిఖీ చేశారు. ముందుగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఓపీ విభాగం, మందుల నిల్వ గది, ఇతర విభాగాలను పరిశీలించారు. అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. రోజువారీ ఓపీ నమోదు, వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించి అన్ని రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధులు, పాముకాటు కేసులు పెరిగే అవకాశమున్నందున వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు తాగునీరు, కూర్చునే సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. అలాగే మండలంలోని ఆరోగ్య ఉపకేంద్రాల పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా మొక్కను నాటి, వాటి సంరక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులతో ముచ్చటిస్తూ చదువులో ప్రతిభ కనబర్చాలని, ప్రతిరోజూ తప్పనిసరిగా పాఠశాలకు హాజరుకావాలని సూచించారు. బడికి రాని విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
మండలంలోని మందపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఎన్యుమరేషన్ ఫారాల ఆన్‌లైన్ నమోదును వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను తనిఖీ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులను అభినందించి, క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యనారాయణ స్వామి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంఈఓ రామ్‌చందర్, ఎఫ్‌ఆర్‌ఓ కల్పనా దేవి, ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






