నిమ్జ్ రోడ్డుకు గ్రీన్ జోన్ ఫేక్..!

by Taduka Kalyani |

జాతీయ పెట్టుబడుల తయారీ మండలి (నిమ్జ్) పరిధిలో నూతనంగా నిర్మించిన రహదారి వెంట గ్రీన్ జోన్ ఏర్పాటు చేశారంటూ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాత ఫోటోలను వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నిమ్జ్ రోడ్డుకు గ్రీన్ జోన్ ఫేక్..!
X

దిశ, ఝరాసంగం: జాతీయ పెట్టుబడుల తయారీ మండలి (నిమ్జ్) పరిధిలో నూతనంగా నిర్మించిన రహదారి వెంట గ్రీన్ జోన్ ఏర్పాటు చేశారంటూ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాత ఫోటోలను వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తప్పుడు ప్రచారం ద్వారా అమాయక రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానిక కృష్ణాపూర్, మాచునూర్, బర్దిపూర్, పొట్టిపల్లి రైతులు తీవ్రంగా మండిపడ్డారు. అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదని, ఇలాంటి ప్రచారాలు చేసి అమాయక రైతులను మోసం చేయొద్దని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఉన్నత అధికారులు ధ్రువీకరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మ్యాప్‌ను స్ప్రెడ్ చేస్తూ అందులో కొన్ని సర్వే నంబర్లను జోడించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే రోడ్డు నిర్మాణంలో కొంత భూమి కోల్పోయి, మిగిలి ఉన్న రోడ్డుకు ఇరువైపులా భూములు ఉన్న రైతులు ఈ ప్రచారం చూసి మరింత భయాందోళనకు గురవుతున్నారు.

మాకు ఎలాంటి సమాచారం లేదు : - నిమ్జ్ ప్రత్యేక అధికారి విశాలాక్షి

నిమ్జ్ పరిధిలోని ప్రత్యేక రహదారికి గ్రీన్ జోన్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని నిమ్జ్ ప్రత్యేక అధికారి విశాలాక్షి తెలిపారు.

Next Story