‘కుడా’ ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో కీలక ముందడుగు

by Jakkula.Mamatha |

కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(KUDA) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ల్యాండ్ పూలింగ్ స్కీమ్(LPS) ప్రక్రియలో భాగంగా వరంగల్, హనుమకొండ నగరాల పరిధిలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

‘కుడా’ ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో కీలక ముందడుగు
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(KUDA) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ల్యాండ్ పూలింగ్ స్కీమ్(LPS) ప్రక్రియలో భాగంగా వరంగల్, హనుమకొండ నగరాల పరిధిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హనుమకొండ వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్స్ పరిసర ప్రాంతాల్లోని భూములను అభివృద్ధి చేసేందుకు భూ యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మంగళవారం వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్స్ భూ యజమానుల కమిటీ సభ్యులు, ప్రతినిధులైన బూర విద్యాసాగర్, ఎం.విజయ్ కుమార్, డి.స్వరాజ్యలక్ష్మి, బూర అశోక్ కుమార్, బల్లెం వెంకటయ్య, రాజేష్, తిరుపతి రెడ్డిలు సంయుక్తంగా కుడా కార్యాలయంలో చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డిని, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ క్రమంలో వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ పరిధిలోని సుమారు 30 ఎకరాల విలువైన భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీమ్(LPS) నిబంధనల ప్రకారం.. కుడా ఆధ్వర్యంలో లేఅవుట్ అభివృద్ధి చేయడానికి యజమానులు సంపూర్ణ అంగీకారం తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక అప్లికేషన్లు, భూమి హక్కుల పత్రాలు మరియు అవసరమైన అన్ని డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను అధికారికంగా సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. నగర సుందరీకరణ, క్రమబద్ధమైన పట్టణాభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు గాను, రాబోయే 4 రోజుల్లో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

వరంగల్ అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తున్నా తనపై, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే వినయ్భాస్కర్ అవాస్తవ ఆరోపణలు చేయడం మానుకోవాలని కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. కుడా వేలంలో అవినీతి జరిగితే ఆ భూములు బీఆర్ఎస్ నాయకులు కొనుక్కోవాలి అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం కోసం మొదట ఆ భూమిలోనే భూమి పూజ చేసి అక్కడ ఉండలేమని గ్రహించి విలువైన పార్క్ స్థలాన్ని కబ్జా చేసిన బీఆర్ఎస్ నాయకులు దొంగే దొంగ అనే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ స్థలాన్ని 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా భాష మార్చి అవాస్తవ ఆరోపణలు మానుకొని వాస్తవాలు మాట్లాడాలని అన్నారు.

Next Story