పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం.. వ్యక్తికి శిక్ష

by Batti.Sumithra |

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హుజూర్‌నగర్ రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శివరాం ప్రసాద్ మంగళవారం తీర్పు వెలువరించారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం.. వ్యక్తికి శిక్ష
X

దిశ, హుజూర్‌నగర్ టౌన్ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హుజూర్‌నగర్ రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శివరాం ప్రసాద్ మంగళవారం తీర్పు వెలువరించారు. హుజూర్‌నగర్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బొబ్బ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన కటారి అరుణ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటూ వివాహ సంబంధాల కోసం మ్యారేజ్ బ్యూరోలో తన వివరాలను నమోదు చేసుకుంది. ఆ వివరాలను తెలుసుకున్న హైదరాబాద్‌లోని బోడుప్పల్‌కు చెందిన గొర్రె ప్రభుదాస్ ఆమెను సంప్రదించి, తనను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. తాను నిరుద్యోగినని, తన అవసరాల కోసం డబ్బు కావాలని చెప్పి వివిధ దఫాల్లో ఆమె నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నాడు. అనంతరం తన స్వగ్రామమైన కర్నూలుకు తీసుకెళ్లి, తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని నమ్మించాడు. అక్కడ తన తల్లిదండ్రులను బయటకు పంపించి, అదే రాత్రి ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. అనంతరం హైదరాబాద్‌లోనూ తరచూ తన గదికి పిలిపించుకొని ఆమెపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. తర్వాత అధిక కట్నం ఆశించి వేరే వివాహ సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న బాధితురాలు అతన్ని కలిసి తనను వివాహం చేసుకోవాలని కోరగా, అతడు నిరాకరించి వేరే సంబంధం చేసుకుంటానని స్పష్టంగా చెప్పాడు.

అంతేకాకుండా ఆమెను అసభ్య పదజాలంతో దూషించి, చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అప్పటి గరిడేపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి మోసం, అత్యాచారం, దూషణ, బెదిరింపులకు సంబంధించిన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి హుజూర్‌నగర్ సీఐ భాస్కర్ దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షుల విచారణ అనంతరం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బొబ్బ కోటిరెడ్డి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, నిందితుడు గొర్రె ప్రభుదాస్‌పై మోసం (చీటింగ్) చేసిన అభియోగం మాత్రమే రుజువైందని నిర్ధారించింది. దీంతో అతనికి మూడు సంవత్సరాల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.1,500 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో నెల రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శివరాం ప్రసాద్ తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున లైజన్ అధికారి వెంకన్న సహకరించినట్లు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.

Next Story