ఆగిన ‘సేతు బంధు’ శ్వాస.. పద్మశ్రీ గిరీష్ భరద్వాజ్ కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-07 10:06:58  IST  )

దేశవ్యాప్తంగా 140కి పైగా తూగు వంతెనలను నిర్మించి ‘సేతు బంధు’ గిరీష్ భదధ్వాజ్ కన్నుమూశారు.

ఆగిన ‘సేతు బంధు’ శ్వాస.. పద్మశ్రీ గిరీష్ భరద్వాజ్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో తక్కువ ఖర్చుతో కూడిన వంతెనలను నిర్మించి, వేలాది మంది గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ‘బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ గిరీష్ భరద్వాజ్ (76) కన్నుమూశారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఇవాళ ఆయన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సుళ్ల్యలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే, మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన భరద్వాజ్ వంతెనల నిర్మాణ ప్రయాణం 1989లో ప్రారంభమైంది. సుళ్ల్యలోని అరంబూరు గ్రామస్థులు పాయస్విని నదిని దాటడానికి పడవలు దెబ్బతిని ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయన సాయం కోరారు. దీంతో భదద్వాజ్ తోటి ఇంజనీర్ల సహాయం, పుస్తకాల ఆధారంగా, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో తొలిసారి తక్కువ బడ్జెట్ తూగు వంతెనను (Suspension Bridge) రూపొందించారు. కేవలం రూ.2 లక్షల కంటే తక్కువ ఖర్చుతో పూర్తయిన ఆ ప్రాజెక్ట్ గ్రామస్థుల జీవితాలను మార్చడమే కాకుండా, ఆయన జీవితకాల ఆశయానికి నాంది పలికింది.

అనంతరం గిరీష్ భరద్వాజ్ గత 3 దశాబ్దాలలో ఆయన కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో 140కి పైగా అద్భుతమైన తూగు వంతెనలను నిర్మించారు. అంతర్జాతీయ డిజైన్ల నుంచి స్ఫూర్తి పొంది, స్థానిక అవసరాలకు అనుగుణంగా సాధారణ వంతెనల కంటే చాలా తక్కువ ఖర్చుతో ఆయన వీటిని రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి, గ్రామీణ వికాసానికి ఆయన చేసిన విశేష కృషికి గాను భారత ప్రభుత్వం 2017లో ఆయనను ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది. గతంలో ప్రధాని మోడీ సైతం ఆయనను ‘సేతు బంధు’ అని కొనియాడుతూ వ్యక్తిగతంగా అభినందన లేఖ రాశారు.

Next Story