- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ NDA భేటీలో ప్రత్యేక ఆకర్షణ.. కూటమి నేతలతో ‘ఝాల్ మురీ’ ఆరగించిన ప్రధాని మోడీ!
ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మోడీ ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి, భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలు అందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా మోడీ నిలిచిన తరుణంలో కూటమి నేతలంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
సందడిగా మారిన ఎన్డీయే సమావేశం
ఈ ప్రత్యేక సమావేశంలో ప్రధాని మోడీ తన సహచర కూటమి నేతలతో కలిసి పశ్చిమ బెంగాల్ ప్రముఖ స్ట్రీట్ స్నాక్ ‘ఝాల్ మురీ’ తింటూ సందడి చేశారు. పశ్చిమ బెంగాల్ నేత సువేందు అధికారి స్వయంగా ప్రధాని మోడీకి, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో పాటు ఇతర ఎన్డీయే నేతలకు ఈ స్నాక్‌ను వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని మోడీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ‘ఈరోజు NDA భేటీలో సహచర నేతలతో ఝాల్ మురీని పంచుకున్నాను’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంతకీ ‘ఝాల్ మురీ’ అంటే ఏమిటి?
‘ఝాల్ మురీ’ అనేది పశ్చిమ బెంగాల్, ముఖ్యంగా కోల్‌కతాలో అత్యంత ప్రాచుర్యం పొందిన వీధి ఆహారం (స్ట్రీట్ ఫుడ్). బెంగాలీ భాషలో ‘ఝాల్’ అంటే ఘాటు/కారం, ‘మురీ’ అంటే బొరుగులు (మురమురాలు) అని అర్థం. బొరుగులలో వేయించిన పల్లీలు, ఉల్లిపాయలు, టమోటాలు, ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు, ప్రత్యేక మసాలాలు కలిపి దీనిని తయారు చేస్తారు. దీనికి ఉపయోగించే ఆవనూనె దీనికి ప్రత్యేకమైన ఘాటును, రుచిని ఇస్తుంది.
గతంలోనూ మోడీ ‘ఝాల్ మురీ’ ముచ్చట!
ప్రధాని మోడీకి ఈ బెంగాలీ స్నాక్ రుచి చూడటం ఇదే మొదటిసారి కాదు. గత పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఝార్గ్రామ్‌లో జరిగిన బహిరంగ సభ ముగించుకుని హెలిప్యాడ్‌కు వెళ్తుండగా, రోడ్డు పక్కన ఉన్న ఒక సాధారణ ఝాల్ మురీ బండి వద్ద ప్రధాని మోడీ ఆగారు. అక్కడ స్థానిక వ్యాపారితో కాసేపు ముచ్చటించి, ఝాల్ మురీ కొనుగోలు చేసి తిన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.






