- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధిక ధరలపై కమ్యూనిస్టుల కన్నెర్ర
అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీ.ఎస్.బోస్ అన్నారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీ.ఎస్.బోస్ అన్నారు. సామాన్యులపై అధిక ధరల భారం పడకుండా చూడాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని పూర్తిగా విస్మరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, పప్పులు, నూనెలు ఇతర నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ బుధవారం మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట సీపీఐ మహా ధర్నాను నిర్వహించింది. ధర్నాలో పాల్గొన్న వారినుద్దేశించి వి.ఎస్.బోస్ మాట్లాడుతూ ధరల పెరుగుదల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్ చార్జీలు, విద్యా, వైద్య ఖర్చులు నిరంతరం పెరుగుతూ ఉండటం వల్ల సామాన్య ప్రజల జీవనం దుర్భరం అవుతున్నదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల జీవన వ్యయం బాగా పెరిగిందని ఆయన పేర్కొంటూ, 2014లో సుమారు రూ. 410 ఉన్న గృహ వినియోగ ఎల్.పి.జి సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,150లు దాటిందన్నారు. అంటే 100 శాతానికి పైగా ధర పెరిగిందన్నారు. అలాగే, పెట్రోల్ ధర లీటర్‌కు రూ.70 నుంచి రూ.117కు చేరుకుందని, డీజిల్ ధర కూడా అదే రీతిలో పెరిగిందన్నారు. వంటనూనె ధరలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పాలు, గుడ్లు, బియ్యం ధరలు కూడా నిరంతరం పెరుగుతుండటంతో మధ్య తరగతి కుటుంబాల నెలవారీ ఖర్చు గత దశాబ్ద కాలంలో రెట్టింపు అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఆదాయవనరులు పెరుగకపోగా, కొనుగోలు వ్యయం మాత్రం రెట్టింపు అయిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించని ప్రభుత్వాలు అక్కడ ధరలు పెరగడం వల్లే ఇక్కడ పెంచామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రాయితీలు ఇచ్చే ప్రభుత్వాలు, ప్రజలకు పెనుభారంగా మారుతున్న ధరల పెరుగుదలపై సబ్సిడీలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే పట్టించుకోక పోవడం, అధిక ధరలకు బాధ్యులను గుర్తించక పోవడం పాలకుల వైఫల్యాలకు నిదర్శనమన్నారు. మరో వైపు నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీలను భర్తీ చేయడంలోనూ పూర్తిగా విఫలమయ్యాయన్నారు. సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ మాట్లాడుత.. ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ప్రచార ఆర్భాటాలకు, కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే నియంత్రించాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్, ఎల్.పి.జి గ్యాస్ ధరలను తక్షణం తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల న్నారు. వినియోగదారులకు సరసమైన ధరలకు నిత్యావసరాలు అందించాలని కోరారు. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సిపిఐ కార్యవర్గం ప్రతినిధులు మేడ్చల్ జిల్లా డీఆర్ఓ మాలతీకి వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నాలో సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు జీ. దామోదర్ రెడ్డి, డీజీ. సాయిలు గౌడ్, తోటపల్లి శంకర్, హరినాథ్ రావు, కె.స్వామి, టి. సత్య ప్రసాద్, రచ్చ కిషన్, నిమ్మల నర్సింహా, యాదయ్య గౌడ్, కృష్ణ, లక్ష్మీ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మేంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి. లక్ష్మణ్ పాల్గొన్నారు.






