- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పశ్చిమాసియాలో భగ్గుమన్న యుద్ధం.. ఇరాన్‌లో వెయ్యి మందికి పైగా మృతి
ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇప్పటివరకు ఇరాన్‌లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య ప్రారంభమైన యుద్ధం పశ్చిమాసియాలో మరింత తీవ్ర రూపం దాల్చింది. టెహ్రాన్‌లోని ఇరాన్ భద్రతా కమాండ్ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేయగా, 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరుతో అమెరికా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు ఇరాన్‌లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌లో ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు 1,097 మంది మరణించినట్లు అమెరికాకు చెందిన 'హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ (HRANA)' వెల్లడించింది. అయితే, మృతుల సంఖ్య కనీసం 1,045గా ఉంటుందని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్ తీవ్ర దాడులు
టెహ్రాన్‌లోని 'బసిజ్' (Basij), ఇరాన్ అంతర్గత భద్రతా కమాండ్ కేంద్రాలపై ఇజ్రాయెల్ వరుస దాడులు చేసింది. ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడమే కాకుండా, ఆ వ్యవస్థలను ఆపరేట్ చేస్తున్న ఇరాన్ సైనికులను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) వెల్లడించింది. మరోవైపు, బీరుట్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై కూడా దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ వాయుసేన ప్రకటించింది.
నలుగురు అమెరికా సైనికులు మృతి
ఇరాన్ ప్రతీకార సామర్థ్యం వేగంగా పడిపోతోందని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో భాగంగా 100 గంటల లోపే 2,000 లక్ష్యాలపై సుమారు 2,000కు పైగా బాంబులతో అమెరికా విరుచుకుపడింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, వందలాది బాలిస్టిక్ క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లను ధ్వంసం చేసింది. కువైట్‌లోని షూబా (Shuaiba) పోర్టులో జరిగిన డ్రోన్ దాడిలో 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'కి మద్దతుగా ఉన్న నలుగురు అమెరికా ఆర్మీ రిజర్వ్ సైనికులు మరణించినట్లు అమెరికా యుద్ధ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.






