48గంటల్లో హోర్ముజ్‌ను తెరవాలి.. లేదంటే నాశనమే : ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

by Naga Rani Yarlagadda |

48 గంటల్లో హోర్ముజ్ జలసంధిని తెరవాలని, లేదంటే ఇరాన్ ను నాశనం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.

48గంటల్లో హోర్ముజ్‌ను తెరవాలి.. లేదంటే నాశనమే : ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాబోయే 48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్‌లోని అతిపెద్ద విద్యుత్ కేంద్రాలతో పాటు పలు కీలక ప్లాంట్లను బాంబులతో నేలమట్టం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ సేనలు ఈ కీలక సముద్ర మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు వ్యాపారం జరుగుతుంది. ఇరాన్ బెదిరింపుల కారణంగా ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత ఆ మార్గాన్ని ఉపయోగించుకునే ఇతర దేశాలదేనని, అమెరికా కేవలం రక్షకుడిగా ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఇరాన్ గనుక మొండిగా వ్యవహరిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు కొరతను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత శుక్రవారం నాటికి నౌకల్లో లోడ్ చేసిన ఇరాన్ చమురుపై ఆంక్షలను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల సుమారు 140 మిలియన్ బారెళ్ల చమురు గ్లోబల్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు. ఇది ఇంధన సరఫరాపై ఉన్న ఒత్తిడిని కొంతమేర తగ్గిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఇరాన్ దళాలు తొలిసారిగా సుదూర లక్ష్యాలను ఛేదించే లాంగ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల యుద్ధం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Next Story