జైలులో ఘర్షణలు.. 25 మందికి చేరిన మృతుల సంఖ్య

by Naga Rani Yarlagadda |

శ్రీలంకలోని నెగొంబో జైల్లో రెండ్రోజులుగా డ్రగ్స్ ముఠా మధ్య జరుగుతున్న ఘర్షణలు, అల్లర్లలో మరణించిన ఖైదీల సంఖ్య 25కి చేరింది.

జైలులో ఘర్షణలు.. 25 మందికి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకలోని నెగొంబో జైల్లో రెండ్రోజులుగా డ్రగ్స్ ముఠా మధ్య జరుగుతున్న ఘర్షణలు, అల్లర్లలో మరణించిన ఖైదీల సంఖ్య 25కి చేరింది. 100 మందికి పైగా ఖైదీలు గాయపడ్డారు. ఆదివారం రెండు ప్రత్యర్థి ఖైదీల ముఠాల మధ్య మొదలైన చిన్నపాటి ఘర్షణ.. సోమవారం ఉదయానికి పెను ఉద్రిక్తతలకు దారితీసింది. ఖైదీలు జైల్లోని ఆయుధగారాన్ని బద్దలు కొట్టి.. తుపాకులను చేజిక్కించుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ క్రమంలో జైలును తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పలువురు ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. జైల్లో సామర్థ్యానికి మించి ఖైదీలను ఉంచినట్లు తెలుస్తోంది.

ప్రాథమిక పోలీసు నిఘా ప్రకారం.. సుమారు 2,417 మంది ఖైదీలు ఉన్న జైలు బ్లాకుల్లో ఆదివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ హింస చెలరేగింది. జైలు లోపలి నుంచే డ్రగ్స్ నెట్వర్క్ ను నడుపుతున్న రిమాండ్ ఖైదీల ముఠాకు, వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మరో ఖైదీల ముఠాకు మధ్య చెలరేగిన గొడవే దీనంతటికీ కారణమయింది. ఆదివారం రాత్రి మరో ఖైదీల సమూహం తమకు రక్షణ కల్పించాలంటూ జైలు పాత భవనం పైకెక్కి నిరసనకు దిగింది. అయితే, ఖైదీల బరువుకు ఆ పాత భవనం పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో నలుగురు ఖైదీలు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు.

రంగంలోకి సైన్యం.. హై అలర్ట్

పరిస్థితి తీవ్రతను గమనించిన శ్రీలంక ప్రభుత్వం రంగంలోకి దిగింది. వందలాది మంది ఎలైట్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) కమాండోలు, అల్లర్ల నియంత్రణ దళాలు, ఆర్మీ బలగాలను జైలు ప్రాంగణంలోకి పంపింది. సాయుధ ఖైదీలను అణచివేయడానికి భద్రతా దళాలు గాల్లోకి కాల్పులు జరపడంతో పాటు, టియర్ గ్యాస్ ప్రయోగించాయి. ఈ ఘోర ఉదంతంపై కొలంబోలో శ్రీలంక న్యాయ, జాతీయ సమగ్రత శాఖ మంత్రి హర్షన నానాయక్కర స్పందిస్తూ.. నెగొంబో జైలు అల్లర్లపై తక్షణమే స్వతంత్ర మేజిస్టీరియల్ విచారణకు (Magisterial Inquiry) ఆదేశించినట్లు ప్రకటించారు.

Next Story