వర్క్ ఫ్రం ‘హోమే’ బెటర్

by  |
Work from Home
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి చెప్పాలంటే బీఫోర్ కరోనా… ఆఫ్టర్ కరోనా అని చెప్పొచ్చు. అంతలా వారిలో మార్పు తీసుకొచ్చింది వర్క్ ఫ్రం హోం. ఉద్యోగం చేయాలంటే ఆఫీసుకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే అనే నిబంధనకు ఫుల్ స్టాప్ పెట్టింది. చాలా పనులు ఇంటి నుంచే చేయోచ్చు అని నిరూపించింది. అందులో భాగంగా ఐటీ ఉద్యోగులు సైతం ఇంటి నుంచి వర్కు చేసి ఉత్పాదకతను పెంచారు. దీంతో ఐటీ కంపెనీలకు ఖర్చు తక్కవ, ఎక్కువ లాభాలు వస్తుండటంతో వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహిస్తూ పొడగిస్తుండంతో సాఫ్ట్‌వేర్స్ సైతం ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు నూటికీ 80 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్’బాగుందనే అభిప్రాయం వెల్లడించారు.

కరోనా కల్లోలంతో అన్ని రంగాలూ కుదేలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగించుకునేలా వెసులుబాటు కల్పించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. కానీ హైదరాబాద్‌లో ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. 80 శాతం ఐటీ కంపెనీలు కొవిడ్-19 హాట్‌స్పాట్లు, కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ఉండటమే అందుకు కారణం. దిగ్గజ కంపెనీలన్నీ ఈ హాట్‌స్పాట్లలోనే ఉన్నాయి. అంతేకాదు.. హైదరాబాద్‌లో నమోదైన తొలి కేసులో బాధితుడు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే కావడం గమనార్హం. దీంతో కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం ఇచ్చాయి. ఉత్పదకత కూడా పెరగడంతో, కంపెనీల నిర్వహణ ఖర్చులు తగ్గడంతో వర్క్ ఫ్రం హోంకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే కంపెనీల్లో పనిచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ఓ ప్రముఖ కంపెనీ సీఈఓ తెలిపారు.

50 శాతానికి పైగా కంపెనీల్లో ..

హైదరాబాద్‌ ఐటీ రంగంలోని 50 శాతానికి పైగా కంపెనీలు తమ ఉద్యోగుల్లో 25 శాతం మంది ఉద్యోగులు ఊరెళ్లి అక్కడి నుంచే పని చేస్తున్నారని వెల్లడించాయి. 25 శాతం కంపెనీల్లో 50 శాతానికి పైగా ఉద్యోగులు సొంతూళ్లలోనే ఉన్నారు. తమ ఉద్యోగుల్లో 25 శాతం మంది హైదరాబాద్‌లో లేరని 50 శాతానికి పైగా పెద్ద, అతిపెద్ద కంపెనీలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే 90 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నప్పటికీ ఐటీ కంపెనీల్లో ఉత్పాదకత గతం కంటే పెరిగింది. ఉద్యోగులు అనేక ప్రాంతాల నుంచి పని చేస్తున్నందున ఆర్‌టీఓ కొత్త క్లిష్టతను సంతరించుకుంది. కొవిడ్‌కు ముందున్న విధంగా వంద శాతం మంది ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేయడాన్ని ఇక చూడలేమొనని, వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు మళ్లీ హైదరాబాద్‌కు ఎప్పుడు వస్తారన్నది చెప్పడం కష్టమేనని పేర్కొంటున్నాయి.

కంపెనీలకు లాభాలు…

గ్రేటర్ హైదరాబాద్ ఐటీకి నిలయం. హైదరాబాద్ పరిస్థితులు ఐటీకి అనుకూలంగా ఉండటంతో ఇతర దేశాలకు చెందిన కంపెనీలు తమ బ్రాంచ్ లను ఏర్పాటు చేశాయి. ఒక్కో కంపెనీ మూడు నుంచి నాలుగైదు బ్రాంచులను ఏర్పాటు చేశారు. ఒక్కో బ్రాంచ్ లో 3వేల నుంచి 3500 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగులంతా కంపెనీకి వచ్చిపోయేందుకు క్యాబ్‌లకు 70శాతం ఖర్చు చేస్తూ ఉద్యోగుల వేతనం నుంచి 30 శాతం కట్ చేస్తుంది. క్యాడర్ ను బట్టి రవాణా చార్జీలను కేటాయిస్తుంది. ప్రతి నెలా లక్షలాది రూపాయలను రవాణాకు ఖర్చు చేస్తుంది. ఒక్కో ఉద్యోగిపై నెల వేతనం కాకుండా సుమారు రూ.5 వేలను వెచ్చిస్తోంది. ఒక కంపెనీలో సుమారు 10,500 మంది ఉద్యోగులుంటే నెలకు రూ. 50 లక్షల మేర ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే లాక్‌డౌన్‌తో ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోమ్’ఇవ్వడంతో ఒక్కో కంపెనీకి రూ.50 లక్షలు మిగులుతోంది. దీనికి తోడు కంపెనీలకు ఒక్కో బ్రాంచ్ రూ. 3 లక్షల చొప్పున సుమారు రూ.9 లక్షలకు పైగా ఆదా అవుతుంది. దీనికి తోడు క్యాంటిన్ నిర్వహణ ఖర్చులు, కరోనా నిబంధనల నేపథ్యంలో ఐటీ కంపెనీలలో అర్ధగంటకు ఒకసారి శానిటైజేషన్ ఖర్చులు కూడా మిగిలిపోతున్నాయి.

‘వర్క్ ఫ్రం హోమ్’పెంచే ఆలోచనలో…

ఉత్పాదకత పెరగడం, మౌలిక వసతుల కల్పన వ్యయం తగ్గడంతో కంపెనీలు ఎప్పటికప్పడు వర్క్ ప్రం హోంను పొడిగించుకుంటూ వస్తున్నాయి. ప్లగ్ అండ్ ప్లే తీసుకున్న ఒక్కో సీటుపై సగటును రూ. 5వేల నుంచి 7 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పడు అది మిగులుతోంది. క్యాబ్‌లు, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, ఆఫీసు బాయ్స్ ఖర్చు తగ్గుతుంది. ఉద్యోగులు సెలవులు తీసుకోరు. 24 గంటలు కంపెనీ ప్రతినిధులకు అందుబాటులో ఉంటారు.

ఏడాదికి పైగా ఉద్యోగులు ఇంటికే పరిమితం కావడం, గంటల తరబడి వర్చువల్ సమావేశాలతో ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారు. అయినప్పటికీ పనిలో కొత్తదనం కోసం ప్రయత్నం, సమయాలకు అనుగుణంగా ఆహారం, సమయాలకు నిద్రించడం, కార్యాలయాలకు రానుపోను సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఎక్కువ సేపు కూర్చోకుండా పిల్లలతో గడపడం, శారీరక వ్యాయామం చేస్తున్నారు.

రిలాక్స్ గా పని చేస్తున్నాం…

Venkanna

ప్రస్తుత తరుణంలో కంపెనీకి వెళ్లి ఉద్యోగం చేసేదానికంటే ఇంటి దగ్గర నుంచి పనిచేయడం బాగుంది. కొన్ని సమస్యలు వస్తున్నప్పటికీ కరోనా సమయంలో కుటుంబంతో ఉండి… పనిచేయడం మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. వర్చువల్ పద్ధతిలో కొంత ఇబ్బందులు తలెత్తినప్పటికీ కొత్తదనం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాం. ఆఫీసులో అయితే ఏమైన సమస్యలు ఉంటే ఉద్యోగులతో షేర్ చేసుకునేవారం. ఇప్పుడు ఫోన్ లో పరిష్కరించుకోవడం కొంత ఇబ్బంది అవుతుంది.
-నల్లమాద వెంకన్న, సాప్ట్ వేర్ కంపెనీ, మాదాపూర్

సమయం ఆదా… ఎక్కువ అవుట్ ఫుట్ ఇస్తున్నాం..

Swami

కరోనాకు ముందు ఆఫీసుకు వెళ్లి వచ్చేందుకే సుమారు 3 గంటలు పట్టేది. రిస్కు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచే పనిచేస్తుండటంతో సమయం ఆదా అవుతోంది. కంపెనీ పనిగంటల కంటే ఎక్కువ చేస్తున్నాం. ఆశించిన దానికంటే ఎక్కువ అవుట్ ఫుట్ ఇస్తున్నాం. వీక్లి సెలవుల్లో కూడా కంపెనీ అవసరాలకు పనిచేస్తున్నాం. పెండింగ్ వర్కులను కూడా త్వరగా చేసుకుంటున్నాం.
-స్వామి, ఐబీఎం సాప్ట్ వేర్ కంపెనీ

‘వర్క్ ఫ్రం హోమ్’బాగుంది..

‘వర్క్ ఫ్రం హోమ్’ బాగుంది. కరోనా సమయంలో ఆఫీసుకు వెళ్లి వర్క్ చేసే కంటే ఇంటి దగ్గర సేప్ గా ఉండటంతో కుటుంబాన్ని సైతం కాపాడుకుంటూ వర్క్ చేస్తున్నాం. ఎక్కువ సమయం పని చేస్తున్నాం. కరోనా టైం లోనే కాకుండా సాధారణ సమయంలో కూడా అమెరికా మాదిరిగా వారానికి మూడు రోజులు ఆఫీసుకు వెళ్లి పనిచేసేలా, మిగతా రోజులు ఇంటి నుంచి పనిచేసే సదుపాయం కల్పిస్తే బాగుంటుంది.
-కిరణ్, ఐటీ కంపెనీ క్వాలిటీఎనలిస్టు లీడ్, హైటెక్ సిటీ


Next Story

Most Viewed