పది రోజుల్లో బడి ప్రారంభం.. కూలే కప్పు కింద విద్యార్థుల చదువు !

by Batti.Sumithra |

చదువు అంటే వెలుగు అంటారు. కానీ వెంకటాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు వెలుగుకన్నా భయంతో రోజులు గడుపుతున్నారు.

పది రోజుల్లో బడి ప్రారంభం.. కూలే కప్పు కింద విద్యార్థుల చదువు !
X

దిశ, వెంకటాపూర్ (రామప్ప) : చదువు అంటే వెలుగు అంటారు. కానీ వెంకటాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు వెలుగుకన్నా భయంతో రోజులు గడుపుతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనంలోనే 32 మంది విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జూన్ 15న పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా ఇప్పటికీ మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 25 ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల భవనం పూర్తిగా దెబ్బతిన్నది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడుతుండగా, ఇనుప కడ్డీలు బయటకు కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో పైకప్పు నుంచి నీరు కారడంతో తరగతి గదులు బురదమయమవుతున్నాయి. గోడలు తేమతో నల్లబడిపోయాయి. కిటికీలకు అద్దాలు, తలుపులకు గడియలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ తీగలు బయటకు వేలాడుతుండటం మరింత ప్రమాదకరంగా మారింది.

విద్యార్థుల భయం..

ఇటీవల పైకప్పు నుంచి పెచ్చు ఊడి ఒక విద్యార్థి చేతికి గాయమైనట్లు విద్యార్థులు చెబుతున్నారు. "క్లాసులో కూర్చుంటే పైకప్పు ఎప్పుడు కూలుతుందోనని భయంగా ఉంటుంది. వర్షం వస్తే బయటకు పంపిస్తారు. చదువుకోవాలా, ప్రాణాలు కాపాడుకోవాలా అనే పరిస్థితి ఏర్పడింది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయుల వేదన..

పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు గత రెండేళ్లుగా అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకపోయిందని తెలిపారు. ఫోటోలు పంపాం, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా ఇప్పటి వరకు ఒక్క ఇటుక కూడా మారలేదు. తల్లిదండ్రుల సహకారంతో తాత్కాలిక మరమ్మతులు చేయించాం. కానీ వర్షాలకు మళ్లీ దెబ్బతిన్నాయి. భవనం సురక్షితం కాకపోవడంతో విద్యార్థులను ఎక్కడ కూర్చోబెట్టాలనే ఆందోళన కలుగుతోంది అని వారు పేర్కొన్నారు.

తల్లిదండ్రుల ఆగ్రహం..

ఇది పాఠశాలా లేక శ్మశానమా.. ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్థోమత లేదు. ప్రభుత్వ పాఠశాలకు పంపితే ప్రాణాల భయం వెంటాడుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు, ఇప్పుడే అధికారులు చర్యలు తీసుకోవాలి అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామ యువకుల హెచ్చరిక..

రెండేళ్లుగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ పరిష్కారం కనిపించకపోవడంతో గ్రామయువకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 15లోపు చర్యలు తీసుకోకపోతే పాఠశాల ఎదుట ధర్నా చేపడతామని, అవసరమైతే విద్యార్థులతో రోడ్డుపైనే తరగతులు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ప్రమాదం పొంచి ఉంది..

వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే పగుళ్లు ఏర్పడిన పైకప్పు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రమాదకర భవనాల్లో తరగతులు నిర్వహించకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, ఇక్కడ మాత్రం విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి బోధన కొనసాగుతోందని విమర్శిస్తున్నారు.

అధికారుల స్పందన..

ఈ విషయం పై మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) స్పందిస్తూ, "జూన్ 12లోపు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒక గదిని కేటాయిస్తాం. విద్యార్థులను ఆటో ద్వారా అక్కడికి తరలించి బోధన కొనసాగిస్తాం. శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని కూల్చి కొత్త పాఠశాల భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా వెంటనే తాత్కాలిక ఏర్పాట్లు చేసి, కొత్త భవన నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని గ్రామస్తులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story