‘మంత్రిగారు మీకు దండం.. మా సంసారాలు కాపాడండి’

by  |

దిశ వికారాబాద్: అమ్మ మీకు దండం పెడతాం.. మా సంసారాలను కాపాడండి అంటూ మహిళలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని వేడుకున్నారు. బుధవారం వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామంలో పర్యటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్దకు గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకొని గ్రామంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు బెల్టు షాపులు కొనసాగడంతో కాపురాలు పాడు అవుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఇప్పటికే గ్రామంలో నలుగురు కోడల్లు కాపురం చేయకుండా గ్రామం విడిచి తల్లిగారింటికి వెళ్లారని వారి అత్తలు తమ బాధను మంత్రి ముందు వెళ్లబుచ్చారు. ఇదిలా ఉంటే వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నా ఎక్సైజ్ పోలీస్ శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కాసులకు కక్కుర్తిపడి గ్రామాలలోని పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా వికారాబాద్ మండలంలోని మైలార్ దేవ్ పల్లి, మద్గుల్ చిట్టంపల్లి, సిద్దులూరు, పులుసుమామిడి, మదన్ పల్లి తదితర గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నా ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story