ఆ రాష్ట్రాల్లో మహిళలకు భద్రత లేదు.. ప్రధాని మోడీ

by  |
ఆ రాష్ట్రాల్లో మహిళలకు భద్రత లేదు.. ప్రధాని మోడీ
X

చెన్నై, తిరువనంతపురం : బీజేపీయేతర రాష్ట్రాలలో మహిళలకు భద్రత కరువైందని ప్రధాని మోడీ అన్నారు. బెంగాల్‌లో ఒక వృద్ధురాలు రాజకీయ హత్యకు గురైతే బీజేపీ తప్ప దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్పందించలేదని మండిపడ్డారు. తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలలో పాల్గొన్న ఆయన ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించారు.

తమిళనాడులోని ధరాపురంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ.. ‘సోమవారం పశ్చిమబెంగాల్‌లో ఒక వృద్ధురాలు (బీజేపీ కార్యకర్త తల్లి) మరణించింది. కొద్దిరోజుల క్రితం సిద్ధాంతపరమైన విభేదాలతో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గూండాలు ఆమె మీద దాడి చేయడంతో ఆ తల్లి చనిపోయింది.

కాంగ్రెస్, డీఎంకే గానీ, లెఫ్ట్ పార్టీలు గానీ ఆమె మరణంపై స్పందించాయా..? వృద్ధురాలు మరణంపై ప్రతిపక్ష పార్టీలు అన్నీ మౌనం దాల్చాయి’ అని మండిపడ్డారు. తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకేల కూటమిపై స్పందిస్తూ.. ఆ రెండు పార్టీలు వారసత్వ రాజకీయాలకు ప్రతీకలని అన్నారు. మహిళలంటే ఆ రెండు పార్టీలకు గౌరవం లేదని, మహిళా సాధికారత వాటితో సాధ్యం కాదని దుయ్యబట్టారు. కాంగ్రెస్, డీఎంకేలది వారసత్వ ఎజెండా అయితే తమది అభివృద్ధి ఎజెండా అని చెప్పారు. పుదుచ్చేరిలో సీఎం అభ్యర్థికే టికెట్ కేటాయించలేదని, దానిని బట్టి అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చునని అన్నారు.

దొందూ దొందే : కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటమిపై ప్రధాని..

కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్), యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌(యూడీఎఫ్)లు ఒకే జట్టు అని, తమ లోపాలను, దాష్టీకాలను బయటపెట్టుకోకుండా వీటి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదని మోడీ ఆరోపించారు. పాలక్కడ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ.. యూధులు వెండి ముక్కల కోసం జీసస్‌ను మోసం చేస్తే, బంగారు కడ్డీల (గోల్డ్ స్కాంను ఉద్దేశిస్తూ) కోసం ఎల్‌డీఎఫ్ రాష్ట్రాన్నే వంచించిందని ఆరోపించారు. కేరళలో రాజకీయ హింసకు చరమగీతం పాడాలంటే బీజేపీని గెలిపించాలని ఓటర్లను కోరారు.


Next Story

Most Viewed