రాత్రి అతనికి ఫోన్ చేసి వస్తానంది.. కానీ, రోడ్డు పక్కన అలా కనిపించింది

330

దిశ, ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో దారుణం జరిగింది. వివాహిత మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేసి మాడ్గుళ్ల సమీపంలో రోడ్డు పక్కన మృతదేహాన్ని పడేశారు. వివరాలలోకి వెళితే.. మాడ్గుళ్ల మండలం చంద్రాయణ్ పల్లి గ్రామానికి చెందిన కొమ్ము పోశమ్మ (38), ఆమె భర్త గాలయ్య పొట్టకూటి కోసం కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్ కి వచ్చారు. ఇక కొమ్ము పోశమ్మ గోషామహాల్ వద్ద కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి  ఆమె సొంత ఊరు చంద్రాయణ్ పల్లికి ఆటోలో బయలుదేరింది కానీ, ఇంటికి చేరలేదు.

బుధవారం ఉదయం ఆమె మాడ్గుళ్ల సమీపంలో రోడ్డు పక్కన శవంగా కనిపించింది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాత్రి 8 గంటల సమయంలో ఆటోలో బయలుదేరినట్లు భర్తకు ఫోన్ చేసి చెప్పిందని, తనకోసం ఎదురు చూస్తూ కూర్చొన్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటికి వస్తున్నా అన్న మహిళ ఉదయానికి శవంలా కనిపించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహిళపై ఏమైనా లైంగిక దాడి జరిగిందా..? లేక డబ్బుకోసం ఎవరైనా హత్యచేశారా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వెంటనే క్లూస్ టీం, డాగ్ స్కార్డ్‌ను పోలీసులు రంగంలోకి దింపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..