తక్కువ ధరకే ఆ పని చేస్తూ పోలీసులకు చిక్కిన మహిళ.. గతంలో సోదరి ఇదే పనిలో..!

by  |
తక్కువ ధరకే ఆ పని చేస్తూ పోలీసులకు చిక్కిన మహిళ.. గతంలో సోదరి ఇదే పనిలో..!
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: గంజాయి ర‌వాణాలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఇన్నాళ్లు మ‌త్తు ప‌దార్థాల స్మగ్లింగ్‌లో ఈజీ మ‌నీకి అల‌వాటుప‌డిన యువ‌త‌, బీటెక్ స్టూడెంట్స్‌, దొంగ‌త‌నాల‌కు పాల్పడే వారే పోలీసుల‌కు చిక్కారు. తాజాగా మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు ఎక్సైజ్ స్టేష‌న్ ప‌రిధిలోని మ‌రిపెడ మండ‌లం గ్యామా తండాకు చెందిన ఓ గిరిజ‌న మ‌హిళ ప‌ట్టుబ‌డ‌టం గ‌మ‌నార్హం. మ‌రో మ‌హిళ‌ను కూడా సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డిన మ‌హిళకు సోద‌రి వ‌రుస‌య్యే మ‌హిళ‌ను నెల‌క్రితం అదుపులోకి తీసుకున్నారు. మ‌రికొంత‌మంది మ‌హిళ‌ల‌పై నిఘా పెట్టిన ఎక్సైజ్-సీసీఎస్ పోలీసులు ప‌ట్టుకునే ప‌నిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక‌టి రెండు కిలోల‌కు మించకుండా ప్యాకింగ్ చేసిన గంజాయిని మ‌హిళ‌లు హ్యాండ్ బ్యాగుల్లో క్యారీ చేసేలా ప్లాన్ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. మాములుగా ఆర్టీసీ బ‌స్సుల్లోనే ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్ ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నట్లుగా సమాచారం. వాస్తవానికి వీరికి అంద‌జేస్తున్న మొత్తం కూడా చాలా త‌క్కువేన‌ని, కాసింత డ‌బ్బు ఆశ‌చూపి ప్రమాద‌క‌ర‌మైన స్మగ్లింగ్‌లోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.

గంజాయి ర‌వాణాలో ఇంట‌ర్ లింకులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖ‌మ‌న్యం, సీలేరు, అర‌కులోయ ప్రాంతాల్లో పండిస్తున్న గంజాయిని తెలంగాణ‌లోని ప‌ట్టణ ప్రాంతాల‌కు చేరుతోంది. గంజాయి ర‌వాణాకు పాల్పడుతున్న వారిలో వినియోగించే వారు సైతం ఎక్కువ‌గా ఉన్నట్లుగా సీసీఎస్ పోలీసుల విచార‌ణ‌లో వెల్లడవుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న అంశంగా చెప్పాలి. భ‌ద్రాచలం చెక్‌పోస్టు మొద‌లు హైద‌రాబాద్‌లోని గ‌మ్యస్థానాల‌కు చేర్చే క్రమంలో నిత్యం క్వింటాళ్ల కొద్దీ గంజాయి ప‌ట్టుబ‌డుతోంది. ఎక్సైజ్ అధికార వ‌ర్గాల ద్వారా తెలుస్తున్న స‌మాచారం ప్రకారం.. వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లాలో ఇంట‌ర్ లింకుల ద్వారా గంజాయి ర‌వాణా సాగుతోంది. ప్రధానంగా భూపాల‌ప‌ల్లి, మ‌రిపెడ‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమకొండ‌, చిట్యాల‌, పాల‌కుర్తి, బ‌చ్చన్నపేట‌, ఏటూరునాగారం, రాయ‌ప‌ర్తిల మీదుగా ఇంట‌ర్ లింకుల‌తో గంజాయి స్థానికంగా కొంత‌.. అధిక మొత్తంలో హైద‌రాబాద్‌తోపాటు శివారు జిల్లాలైన‌, రంగారెడ్డి, మెద‌క్‌ల‌కు త‌ర‌లిపోతోంది. గంజాయి ర‌వాణాలో కొత్త లింకులు, కోణాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు, అర‌కు ప్రాంతాల్లో నుంచి గంజాయిని ప‌ట్టణ ప్రాంతాల‌కు త‌ర‌లించి కోట్లాది రూపాయాలు సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు.

తండాల్లో సాగు క‌ల్చర్‌..

గంజాయి సాగు క‌ల్చర్ మ‌ళ్లీ తెలంగాణ‌లో పురుడు పోసుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులే వెల్లడిస్తుండ‌టం గ‌మ‌నార్హం. అయితే విచ్చల‌విడిగా సాగు లేకున్నా.. ఏజెన్సీ, మారుమూల తండాలు, ప‌ల్లెల్లో మాత్రం అక్కడ‌క్కడ గంజాయి సాగు వాస‌న వ‌స్తోందంటూ పేర్కొంటున్నారు. మ‌హ‌బూబాబాద్‌, భూపాల‌ప‌ల్లి, వ‌రంగ‌ల్ జిల్లాలో ఈ సాగు క‌ల్చర్ ప్రస్తుతం న‌డుస్తోంద‌న్న అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. సాగు క‌ల్చర్‌ను అరిక‌ట్టకుంటే క్రమంగా వినియోగం పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని ఆందోళ‌న‌ను ప్రజ‌లు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed