ఫాగింగ్ లేకపాయే.. దోమలేమో పెరుగుతుండే.. పట్టించుకోరా..?

by Shyam |

<p>దిశ, చిట్యాల : మండలంలోని ప్రజలు దోమల బెడతతో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. గ్రామ పంచాయతీల అసమర్థత వల్ల పారిశుద్ద్య నిర్వహణ సక్రమంగా జరుగడం లేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో పిచ్చి మొక్కలు, కుంటల్లో నీరు నిల్వ ఉంటోంది. దీని వల్ల దోమల బెడద ఎక్కువవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని నివారించేందుకు గ్రామపంచాయతీలు చేస్తున్న కృషి అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని గ్రామ పంచాయతీలకు ఫాగింగ్ మిషన్లు ఉన్నా అప్పుడప్పుడు ఫాగింగ్ [&hellip;]</p>

ఫాగింగ్ లేకపాయే.. దోమలేమో పెరుగుతుండే.. పట్టించుకోరా..?
X

దిశ, చిట్యాల : మండలంలోని ప్రజలు దోమల బెడతతో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. గ్రామ పంచాయతీల అసమర్థత వల్ల పారిశుద్ద్య నిర్వహణ సక్రమంగా జరుగడం లేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో పిచ్చి మొక్కలు, కుంటల్లో నీరు నిల్వ ఉంటోంది. దీని వల్ల దోమల బెడద ఎక్కువవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని నివారించేందుకు గ్రామపంచాయతీలు చేస్తున్న కృషి అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని గ్రామ పంచాయతీలకు ఫాగింగ్ మిషన్లు ఉన్నా అప్పుడప్పుడు ఫాగింగ్ చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారుతోంది. మరి కొన్ని గ్రామ పంచాయతీలలో అసలు ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేయలేదు. తద్వారా దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగి ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ప్రతి గ్రామంలో ఫాగింగ్ చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

నో ఫాగింగ్‌..

గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం పారిశుద్ద్యానికి పెద్దపీట వేస్తున్నా ఉపయోగం లేకుండా పోతోంది. డ్రైనేజీల శుభ్రత, స్వచ్ఛ గ్రామం వైపు అడుగులు వేసేలా ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. నెలకు ఒకసారి ఫాగింగ్‌ మిషన్ల ద్వారా స్ర్పే చేయాల్సి ఉన్నా కొన్ని గ్రామపంచాయతీల్లో ఫాగింగ్‌ మిషన్లు కొనుగోలు చేయలేదు. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని ప్రజలు చెబుతున్నారు.

పెద్ద గ్రామ పంచాయతీలాలోనే ఫాగింగ్..

చిట్యాల మండల పరిథిలో 24 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అందులో కేవలం పెద్ద జీపీలలో మాత్రమే ఫాగింగ్ చేస్తున్నారు. చిన్న జీపీలలో ఒక్కసారి కూడా ఫాగింగ్ చేసిన దాఖలాలు లేవు. కేవలం బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారుతోంది. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరుగడంలేదు. పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడం, కుంటల్లో నీరు నిలవడం వంటి సమస్యలతో గ్రామాలు దర్శనమిస్తున్నాయి.

డెంగ్యూ, మలేరియా తో ఇబ్బందులు..

గ్రామ పంచాయతీల పరిధిలోని పల్లెల్లో ఫాగింగ్ చేయకపోవడం వల్ల దోమల వ్యాప్తి పెరుగుతోంది. దీనివల్ల ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి రోగాల బారిన పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో అసలు ఫాగింగ్ చేసిన దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. కేవలం బ్లీచింగ్ పౌడర్ చల్లి చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు.

Next Story