పగబట్టిన కరోనా.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

by  |
పగబట్టిన కరోనా.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
X

దిశ, మహబూబాబాద్ : మహబూబూబాద్ జిల్లా నెల్లికుదుర్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. కేవలం 11 రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు, ఇద్దరు కుమారులు కరోనా బారిన పడి మృతి చెందారు. ఆ కుటుంబం ముగ్గురు పెద్ద దిక్కులను కోల్పోవడంతో మిగతా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన తండ్రి, 4న పెద్ద కుమారుడు, 11న చిన్న కుమారుడు,13న తల్లి వరుసగా ఒకే కుటుంబంలో నలుగురు కరోనాకు బలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. నెల్లికుదుర్ మండల కేంద్రానికి చెందిన మద్ది బిక్షం(65), మంగమ్మ (60) దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు వీరన్న(42), చిన్న కుమారుడు ఉపేందర్ (39)లు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే. వీరికి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు.

తండ్రి బిక్షం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. పిల్ల పాపలతో నిత్యం కళకళలాడే ఆ ఇంట్లో ఒక్కసారిగా కరోనా కల్లోలం రేపింది. మొదటగా బిక్షంకు కరోనా సోకగా చికిత్స పొందుతూ ఈ నెల 2న మృతి చెందాడు. రెండు రోజుల తేడాతో పెద్ద కుమారుడు వీరన్నకు పాజిటివ్ రాగా చికిత్స పొందుతూ ఈ నెల 4న మృతి చెందాడు. వరుసగా ఇంటి పెద్దలు మృతి చెందగా కుటుంబం శోకసంద్రంలో మునిగి పోయింది. ఇంకా తెరుకోకముందే ఈ నెల 11న చిన్న కుమారుడు ఉపేందర్, గురువారం తల్లి మంగమ్మలు కూడా కరోనా సోకి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కేవలం 11 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో ఆ కుటుంబం చిన్నాభిన్నం అయింది. కరోనా మహ్మమారి ఆ కుటుంబాన్ని పగపట్టిందని అంతా అనుకుంటున్నారు. కరోనా కాటుకు బాధిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. మృతుల భార్యలు, పిల్లలు రోదిస్తున్న తీరు స్థానికులను, బంధువులను కంటనీరు పెట్టిస్తోంది.


Next Story

Most Viewed