- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణంగూడను జిల్లాకు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి
కర్ణంగూడ గ్రామాన్ని జిల్లాకు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.

దిశ, ఇబ్రహీంపట్నం : కర్ణంగూడ గ్రామాన్ని జిల్లాకు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామస్థులతో నేరుగా మమేకమయ్యారు. గ్రామాభివృద్ధి, వ్యవసాయం, పారిశుద్ధ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, ఓటరు జాబితా పునర్విమర్శ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే పరిస్థితులు ఉన్నందున రైతులు వ్యవసాయ శాఖ సూచనల మేరకు పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. అధిక నీటి అవసరమున్న వరి సాగుపై జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. వర్షాకాలంలో నీటి కాలుష్యం, దోమల వ్యాప్తి, అంటువ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. చెత్తాచెదారం పేరుకుపోకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి కుటుంబం ఆరోగ్య రక్షణకు సహకరించాలని కోరారు. వర్షాలు ప్రారంభమైన వెంటనే గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి ఇంటిలో తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించిన కలెక్టర్, తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేయవచ్చని, పొడి చెత్తను రీసైక్లింగ్ ద్వారా తిరిగి వినియోగించవచ్చని తెలిపారు.
రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి
గ్రామస్థుల అభ్యర్థన మేరకు చెత్త సేకరణ డబ్బాలను అందజేస్తామని, వాటిని సక్రమంగా వినియోగించి జిల్లాకు ఆదర్శంగా నిలవాలని కోరారు. నెల రోజుల తర్వాత గ్రామంలోని ఘన వ్యర్థాల నిర్వహణ పరిస్థితిని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంపోస్ట్ యూనిట్‌ను పూర్తి స్థాయిలో వినియోగించి సేంద్రియ వ్యర్థాలను ఎరువుగా మార్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తోందని అధికారులు వివరించారు. యూరియా, డీఏపీ తదితర ఎరువులను ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే అందజేయనున్నట్లు తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్‌కు యాప్‌ను అనుసంధానం చేసినందున రైతులు తప్పనిసరిగా నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు. భూమి విస్తీర్ణం, సాగు చేస్తున్న పంటల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, తప్పుడు వివరాలు నమోదు చేస్తే ఎరువుల కేటాయింపులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనున్న ప్రత్యేక ఓటరు జాబితా పునర్విమర్శ కార్యక్రమంలో ప్రతి అర్హుడి పేరు నమోదు అయ్యేలా ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కర్ణంగూడ ప్రభుత్వ పాఠశాల పునః ప్రారంభానికి గ్రామస్థులు ముందుకు రావాలి.
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక గ్రామసభలో కలెక్టర్ పిలుపు
గ్రామంలో మూతపడిన ప్రాథమిక పాఠశాలను తిరిగి ప్రారంభించేందుకు గ్రామస్థులు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. చిన్నారులను దూర ప్రాంతాలకు పంపకుండా గ్రామంలోనే విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అనంతరం డీసీపీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తాగి వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా కుటుంబ పోషకులు ప్రాణాలు కోల్పోతున్నారని, కుటుంబ సభ్యులు భద్రతా నిబంధనలు పాటించేలా చూసుకోవాలని కోరారు. యువతలో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల వినియోగం గమనిస్తే వెంటనే డయల్-100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కేపీవీ రాజు, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్, గ్రామ సర్పంచ్ తిరుమల రెడ్డి, ఉపసర్పంచ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సురేష్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, రైతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






