- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడుంబా పై పోలీసుల ఉక్కుపాదం..
జిల్లాలో అక్రమ మద్యం తయారీ, విక్రయాలు, రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక గుడుంబా నిర్మూలన డ్రైవ్ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

దిశ, ఆదిలాబాద్: జిల్లాలో అక్రమ మద్యం తయారీ, విక్రయాలు, రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక గుడుంబా నిర్మూలన డ్రైవ్ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లాలోని 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో 35 ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 26 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో మొత్తం 32.5 లీటర్ల గుడుంబా, 35 లీటర్ల బెల్లం వాష్‌తో పాటు 2 క్యాన్లు, 705 లీటర్ల కల్లు, కల్తీ కల్లు, తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉట్నూర్‌లో 3 కేసులు నమోదు చేసి 6 లీటర్ల గుడుంబా, 15 లీటర్ల బెల్లం వాష్ స్వాధీనం చేసుకోగా, నార్నూర్‌లో 7 మందిపై కేసులు నమోదు చేసి 13 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలాబాద్ రూరల్ పరిధిలో 6 మందిపై కేసులు నమోదు చేసి గుడుంబా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి నలుగురిని బైండోవర్ చేయగా, 500 లీటర్ల కల్లు, తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నేరడిగొండలో 5 మందిపై కేసులు నమోదు చేసి గుడుంబా, బెల్లం వాష్, కల్లు పట్టుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో గుడుంబా తయారీ, విక్రయాలు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హానికరమని ఎస్పీ హెచ్చరించారు. గుడుంబా, గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.






