ఆర్డీఓ ఔట్..?

by  |
ఆర్డీఓ ఔట్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసమంటూ 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. రెవెన్యూ డివిజన్ల సంఖ్యను కూడా పెంచారు. దీంతో ఎవరికి ప్రయోజనమో అర్ధం కావడం లేదని ఉద్యోగవర్గాలంటున్నాయి. రెవెన్యూ పాలనను సమర్ధవంతంగా, వేగవంతంగా అందించేలా ఆర్డీఓలకు అవకాశం లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వారి అధికారాలకు, బాధ్యతలకు కోత పెడితే రెవెన్యూ డివిజన్లతో కలిగే సౌలభ్యమేమిటో అంతుచిక్కడం లేదంటున్నారు.

కొత్తగా అమలులోకి తీసుకొస్తున్న ‘తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం-2020, నాలా సవరణ చట్టం-2020’ ద్వారా ఆర్డీఓలకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారు. ఆర్డీఓ పోస్టులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విలేజ్ రెవెన్యూ అధికారుల పోస్టులు రద్దయిన తర్వాత వారంతా తహసీల్దార్లు ఏ పని చెబితే అది చేస్తున్నారు. తాము కూడా రేపటి నుంచి కలెక్టర్ చెప్పే ప్రతి పని చేయాల్సిందేనన్న సందేహాలు కలుగుతు న్నాయని ఓ డిప్యూటీ కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి భూ సంబంధ వ్యవహారానికి తహశీల్దార్ ను బిగ్ బాస్ చేశారు. వారి మీద ఎలాంటి పర్యవేక్షణ లేదు. వారిని ఎవరూ ప్రశ్నించే వీల్లేకుండా పటిష్టమైన చట్టాలను తీసుకొచ్చారు. ‘ధరణి’ పోర్టల్ పై జరిగిన వీడియో కాన్ఫరెన్స్, శిక్షణా కార్యక్రమాల్లోనూ ఆర్డీఓల భాగస్వామ్యం కనిపించడం లేదు. సీఎం కేసీఆర్ మదిలో ఏమున్నదో ఉన్నతాధికారులకూ అర్ధం కావడం లేదు. ఆర్డీఓ పోస్టులను రద్దు చేస్తారేమోనన్న చర్చ జోరందుకున్నది.

వివాదాలు తీరేదెలా?

ఇప్పటిదాకా తహశీల్దార్ నిర్ణయం అన్యాయం అని భావించినవారు ఆర్డీఓస్థాయిలో అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండేది. అక్కడా అన్యాయమే జరిగిందని అనుకుంటే జాయింట్ కలెక్టర్ (ప్రస్తుతం అదనపు కలెక్టర్) దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకునేవారు. ఇప్పుడేమో తహసీల్దార్ నిర్ణయమే ఫైనల్ చూసేశారు. అన్యాయం జరిగిందని అనిపిస్తే కోర్టుకు వెళ్లాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా 16 వేల పెండింగ్ కేసులు ఉన్నాయి. వాటి పరిష్కారానికి తాత్కాలిక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ కేసుల్లో సింహభాగం ఆర్డీఓల టేబుళ్ల పైన ఉన్నవే. కొత్త చట్టంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్ (జాయింట్ కలెక్టర్)లకు ప్రాధాన్యమే కల్పించలేదు. వీఆర్వోల రద్దు తర్వాత ఏసీబీకి చిక్కిన జాబితాలో తహశీల్దార్లు ఉన్నారు. ఈ నేపధ్యంలో తలెత్తే వివాదాలు, సందేహాలకు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా చేశారు. భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా ప్రతి గ్రామంలోనూ వివాదాల కారణంగా పార్టు బి భూములు అనేకం మిగిలాయి. వాళ్లకు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. ధరణిలోనూ నమోదు చేయలేదు. ఇప్పటికీ వాటిని పరిష్కరించలేదు. వీటికి తహసీల్దార్ స్థాయిలో ఎలాంటి పరిష్కారం లభిస్తుందో వేచి చూడాల్సిందే. ఇంకా అనేక కారణాలతో నిలిపేసిన ఖాతాలూ ఉన్నాయి.

కోర్టుకు ఎవరెళ్లాలి?

తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్లు జారీ చేసిన ఆర్వోఆర్ మ్యూటేషన్లపై హైకోర్టులో వేలాది కేసులు ఉన్నాయి. కొత్త చట్టం ప్రకారం వారికి హక్కులు లేవు. ఆ కేసులు ఎవరి పరిధిలోకి వస్తాయన్న సందేహం మిగిలిపోయింది. ఎవరు ఆ కేసులకు హాజరు కావాలో అర్ధం కావడం లేదని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఆర్డీఓలకు ఎలాంటి అధికారాలు లేనప్పుడు పాత కేసుల్లో వారి పాత్రలపై దాఖలైన కేసుల విచారణను ఎదుర్కోవడం ఎలాగో తెలియడం లేదంటున్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలోనే రెవెన్యూ చట్టాలను తయారు చేశారు. నిబంధనలను తయారు చేసేందుకు జాప్యం చేస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది. దసరాకు ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు షురూ చేయడం కష్టమేనని తెలుస్తోంది.


Next Story

Most Viewed