చేపలు పట్టడానికి వెళ్లి... ప్రమాదవశాత్తు యువకుడు మృతి

by Batti.Sumithra |

రోజు మాదిరిగానే చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందిన ఘటన కామారెడ్డి పెద్ద చెరువులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.

చేపలు పట్టడానికి వెళ్లి... ప్రమాదవశాత్తు యువకుడు మృతి
X

దిశ, కామారెడ్డి : రోజు మాదిరిగానే చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందిన ఘటన కామారెడ్డి పెద్ద చెరువులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని సరంపల్లి గ్రామానికి చెందిన బోడదారి స్వామి(25) బుధవారం సాయంత్రం కామారెడ్డి పెద్ద చెరువులో చేపలు పట్టడానికి వల తీసుకుని బయలుదేరాడు. చేపల కోసం వల వేసిన స్వామి ప్రమాదవశాత్తు అదే వలలో చిక్కుకున్నాడు. అందులోంచి బయటకు రాలేక ఊపిరాడక మృతి చెందాడు. స్వామి మృతదేహాన్ని గురువారం ఉదయం గుర్తించగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఒక్కగానొక్క కొడుకు మృతితో...

ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ తండ్రి రోదన అందరిని కంటతడి పెట్టించింది. మృతుడు స్వామి తల్లి పదేళ్ల క్రితం చనిపోగా తండ్రి మిషన్ భగీరథలో పని చేస్తున్నాడు. కొడుకు చెరువులో మునిగి మృతి చెందడంతో దిక్కులు పిక్కటిల్లెలా రోదించాడు. దీంతో అతని రోదనలు పలువురిని కలిచి వేశాయి.

Next Story